విశ్వంలో ఐదో శక్తి.. బ్లాక్ ఎనర్జీ!
ABN , First Publish Date - 2021-10-21T10:03:03+05:30 IST
ఈ అనంత విశ్వంలో.. విద్యుదయస్కాంత శక్తి, భూమ్యాకర్షణ శక్తి, స్ట్రాంగ్ ఫోర్స్ (అణువులను కలిపి ఉంచే శక్తి..
జెనీవా పరిశోధనలో తాజాగా గుర్తింపు
20 ఏళ్ల క్రితమే వెల్లడించానన్న ‘బిర్లా’ డైరెక్టర్ డాక్టర్ సిద్దార్థ్
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): ఈ అనంత విశ్వంలో.. విద్యుదయస్కాంత శక్తి, భూమ్యాకర్షణ శక్తి, స్ట్రాంగ్ ఫోర్స్ (అణువులను కలిపి ఉంచే శక్తి), వీక్ ఫోర్స్ (అణువులను విడదీసే శక్తి)లతో పాటు ఐదో శక్తి కూడా ఉందని, అదే శూన్య శక్తని బీఎం బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ సిద్దార్థ్ తెలిపారు. తాను 20 ఏళ్ల క్రితమే వెల్లడించిన ఈ విషయాన్ని విదేశీ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారని తెలిపారు. ఇప్పటి వరకు సైన్స్ పరంగా నాలుగుశక్తులు మాత్రమే ఉన్నాయని.. శూన్యంలో కూడా శక్తి ఉంటుందని ముందుగా తాను గుర్తించి.. దాన్ని బ్లాక్ ఎనర్జీగా 20 ఏళ్ల క్రితమే ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించానని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇదే సిద్ధాంతాన్ని అమెరికా, యూకేల్లోని ప్రఖ్యాత వర్సిటీలు, శాస్త్రవేత్తలు ప్రతిపాదించి ఉంటే.. లోకం గుర్తించేంది. నేను భారతీయుడ్ని కావడం వల్ల నా పరిశోధనకు గు ర్తింపు లభించలేదు’’ అంటూ డాక్టర్ సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జెనీవాలోని పార్టికల్ కొలైడర్‌లో ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెలుగు చూసిన అంశాలను సాధారణ సైన్స్ సూత్రాలతో వివరించలేని శాస్త్రవేత్తలు.. ఐదోశక్తి ఉందని అంచనావేశారని, ఇది తన సిద్ధాంతాన్ని బలపరిచేదిగా ఉందని చెప్పారు. శూన్యంలో కూడా శక్తి ఉంటుందని.. ఈ విషయాన్ని కొన్ని సిద్ధాంతాల ఆధారంగా తాను గణించి గుర్తించానని తెలిపారు. తన పరిశోధ న గురించి టెన్సిసీలోని వండర్ బిల్డ్ వర్సిటీ, ఇటలీలోని పలు వర్సిటీల్లో వివరించానని చెప్పారు. అయినా తన పరిశోధనలకు సరైన గుర్తింపు రాలేదని వాపోయారు.