రాష్ట్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్‌ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-09-02T09:25:40+05:30 IST

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతిబింబించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు...

రాష్ట్ర అభివృద్ధిపై నీతి ఆయోగ్‌ ప్రశంసల జల్లు

తెలంగాణ ప్రగతిని నివేదిక ప్రతిబింబించింది

 విపక్ష నేతలు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలి

 రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతిబింబించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ఆగస్టు 31న నీతి ఆయోగ్‌ ‘అర్త్‌ నీతి’ పేర నివేదికను విడుదల చేసిందని, ఇందులో తెలంగాణ సాధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ) గురించి వివరించారని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించిందన్నారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిందంటూ పేర్కొన్నదని చెప్పారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని ఆయన కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సడీపీ రూ.5,05,849 కోట్లు ఉండగా, 2020-21లో రూ.9,80,407 కోట్లకు చేరిందని, అంటే 94ు వృద్ధి నమోదైందన్నారు. రాష్ట్ర వార్షిక వృద్ధి 2015-16 నుంచి ఇప్పటి వరకు సగటున 11.7 శాతం కంటే ఎన్నడూ తగ్గలేదన్నారు. వ్యవసాయ రంగంలో 54 శాతం మంది పాలుపంచుకుంటున్నారని, రాష్ట్ర ఆవిర్భావం సమయంలో రెండు శాతం ఉన్న వ్యవసాయాభివృద్ధి... ప్రస్తుతం 16.5 శాతానికి పెరిగిందని వివరించారు. అలాగే తలసరి ఆదాయంలోనూ దాదాపు రెండింతల వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 2014-15లో తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా 2020-21లో రూ.2,37,632కు పెరిగిందని తెలిపారు. 

Updated Date - 2021-09-02T09:25:40+05:30 IST