పడకల లభ్యత ప్రదర్శించాల్సిందే
ABN , First Publish Date - 2021-05-05T08:15:07+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందించే అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా పడకల లభ్యతను ప్రదర్శించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొవిడ్ చికిత్స అందించే అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా పడకల లభ్యతను ప్రదర్శించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్, రెగ్యులర్ పడకల వివరాలను ఎప్పటికప్పుడు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్దనే ప్రదర్శించాలని పేర్కొంది. అలాగే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువ అవుతుండడంతో, ఎవరిని అడ్మిట్ చేసుకోవాలన్న విషయం పై వైద్య ఆరోగ్యశాఖ ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టతనిచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య డైరెక్టర్ గడల శ్రీనివాస రావు మంగళవారం విడుదల చేశారు. కొవిడ్ స్వల్ప లక్షణాలున్న వారు, లక్షణాలు లేనివారు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 94కు మించి ఉంటే, అటువంటి వారికి ఇంటివద్దనే చికిత్స అందించాలని ఆ మార్గదర్శకాల్లో సూచించారు.