పట్టా ప్రదానంతో ముగిసిన తెలంగాణ వేదవిద్వన్మహా సభలు

ABN , First Publish Date - 2021-02-08T19:47:35+05:30 IST

శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ వేదవిద్వన్మహా సభలు ముగిశాయి.

పట్టా ప్రదానంతో ముగిసిన తెలంగాణ వేదవిద్వన్మహా సభలు

హైదరాబాద్: శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ వేదవిద్వన్మహా సభలు ముగిశాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వివిధ వేద పాఠశాలల నుంచి దాదాపు 250 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 22 మంది పరీక్షాధికారులు ఈ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. చైతన్యపురిలోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు ఈ సభలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ అంతటా వేద విద్యను ప్రోత్సహించడానికే ఈ సభలను నిర్వహించామని, నాలుగు వేదాలనూ అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించామని ట్రస్ట్ అధ్యక్షుడు తూములూరి శాయినాథ శర్మ పేర్కొన్నారు.


ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరమూ వేద సభలను నిర్వహించామని, కోవిడ్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, విద్యార్థులకు ఇబ్బందులు కాకుండానే సభలను నిర్వహించామని ఆయన తెలిపారు. జనార్దనానంద సరస్వతీ స్వామి సంకల్పం, వారి తపోబలంతోనే ఆయా ప్రాంతాల్లో తాము వేద సభలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులందరూ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ప్రతిభను కనబరిచారని, దీనికి తామెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని శాయినాథ శర్మ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి పాల్గొన్నారు. వేద విద్య ప్రోత్సాహానికి తనవంతుగా సహాయపడతానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా వేద విద్యను ప్రోత్సహించడానికి కావల్సిన ప్రోత్సాహకాలను అందిస్తోందని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ... దేశ సంస్కృతి సంప్రదాయాలు వేదాల్లో నిబిడీకృతమై ఉందని, వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా శ్రీశ్రీశ్రీ జనార్దనానంద సరస్వతీ సంస్మృతి ట్రస్ట్ వేద విద్వన్మహా సభలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఈ ట్రస్ట్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా పట్టా ప్రదానాలు చేశారు. వీరితో  పాటు పరీక్షాధికారులను, పండితులను కూడా ట్రస్ట్ సభ్యులు సత్కరించారు. 

Updated Date - 2021-02-08T19:47:35+05:30 IST