నీట్‌లో తెలంగాణ టాప్‌

ABN , First Publish Date - 2021-11-02T08:41:09+05:30 IST

నీట్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులతో సత్తా చాటారు. ఆలిండియా టాప్‌ 20 ర్యాంకర్లలో తెలంగాణ, ఏపీ నుంచి ఇద్దరేసి చొప్పున చోటు సాధించారు.

నీట్‌లో తెలంగాణ టాప్‌

 • ఆలిండియా టాపర్‌గా హైదరాబాదీ మృణాల్‌
 • నగర విద్యార్థి శశాంక్‌కు ఐదో ర్యాంకు 
 • టాప్‌ 20లో నలుగురు తెలంగాణ అమ్మాయిలు
 • అబ్బాయిల్లో టాప్‌ 20లో ఐదుగురు మనోళ్లే
 • ఇద్దరు తెలంగాణ.. ముగ్గురు ఏపీ వాసులు
 • రిజర్వుడు కేటగిరీల్లోనూ అద్భుత ప్రతిభ
 • మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలదే హవా
 • ఒత్తిడి లేకపోవడం వల్లే విజయం
 • ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తుందనుకోలేదు
 • సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా
 • నీట్‌ మొదటి ర్యాంకర్‌ మృణాల్‌


న్యూఢిల్లీ, నవంబరు 1: నీట్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులతో సత్తా చాటారు. ఆలిండియా టాప్‌ 20 ర్యాంకర్లలో తెలంగాణ, ఏపీ నుంచి ఇద్దరేసి చొప్పున చోటు సాధించారు. హైదరాబాద్‌కు చెందిన మృణాల్‌ కుట్టేరి జాతీయ స్థాయిలో 1వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచాడు. నగరానికే చెందిన మరో విద్యార్థి ఖండవల్లి శశాంక్‌ ఆలిండియా 5వ ర్యాంకు సాధించాడు. ఖమ్మంకు చెందిన పెంటేల కార్తీక్‌ 53వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తెలంగాణ అమ్మాయిలు నీట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు. అమ్మాయిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... టాప్‌ 20 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు ఉండటం విశేషం. కాసా లహరి ఆలిండియా 30వ ర్యాంకుతో సత్తా చాటింది. ఈమని శ్రీనిజ 38వ ర్యాంకు, శ్రీనిహారిక 56వ ర్యాంకు, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుపునూరి శరణ్య 60వ ర్యాంకుతో జయకేతనం ఎగరవేశారు. 


ఏపీ విద్యార్థుల్లో విజయవాడకు చెందిన చందం విష్ణు వివేక్‌, గొర్రిపాటి రుషీల్‌ 5వ ర్యాంకుతో మెరిశారు. పీవీ కౌశిక్‌ రెడ్డి 23వ ర్యాంకు సాధించాడు. కౌశిక్‌ రెడ్డి కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత కుమారుడు కావడం విశేషం. అబ్బాయిలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... టాప్‌ 20 ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు సాధించారు. తెలంగాణ నుంచి మృణాల్‌, శశాంక్‌; ఏపీ నుంచి విష్ణు వివేక్‌, రుషీల్‌, పీవీ కౌశిక్‌ రెడ్డి టాప్‌ 20లో ఉన్నారు. ఇక జాతీయ స్థాయిలో... ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా 2వ ర్యాంకు, ముంబైకి చెందిన కార్తీక నాయర్‌ 3వ ర్యాంకు సాధించారు. టాప్‌ ర్యాంకర్లు ముగ్గురికీ వంద శాతం మార్కులు (720/720) వచ్చాయి. కార్తీక నాయర్‌ అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచింది. 


రిజర్వుడు కేటగిరీల్లోనూ టాపర్లు

రిజర్వుడు కేటగిరీల్లో కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దివ్యాంగుల కేటగిరీ టాప్‌ 10 ర్యాంకర్లల్లో ఏపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (22,694వ ర్యాంకు) సత్తా చాటాడు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ టాప్‌ 10 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి సీహెచ్‌ వైష్ణవి (143), ఏపీ నుంచి వడ్డపల్లి నిఖిత (87) చోటు సాధించారు. తెలంగాణకు చెందిన రోహిన్‌ ప్రభు (451) ఎస్సీ కేటగిరీ టాప్‌ 10 ర్యాంకర్లలో నిలిచాడు. ఎస్టీ కేటగిరీలో తెలంగాణ నుంచి కేతావత్‌ విజయ్‌ చందర్‌ (3,965), ఏపీ నుంచి వడిత్యా జయంత్‌ నాయక్‌ (694), కొలకులం మాన్విత (2,116) టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారు. ఓబీసీ (నాన్‌ క్రీమీలేయర్‌) కేటగిరీలో ఏపీ నుంచి విష్ణు వివేక్‌ (5), తెంటు సత్య కేశవ్‌ (38వ ర్యాంకు)టాప్‌ 10 ర్యాంకర్లలో నిలిచారు. ఈ ఏడాది నీట్‌ పరీక్షను సెప్టెంబరు 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సుమారు 16,14,777 మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 15,44,275 మంది హాజరయ్యారు. 


వీరిలో 56.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 6,81,168 మంది అబ్బాయిలు పరీక్షకు హాజరైతే వారిలో 3,75,260 మంది ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిల్లో 8,63,093 మంది పరీక్ష రాయగా, 4,94,806 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. 57.32 శాతం మంది అమ్మాయిలు అర్హత సాధించగా.. అబ్బాయిల్లో 55.09 శాతం మాత్రమే అర్హత పొందారు. ఈసారి అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 138 మార్కులు; ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108 మార్కులను కటా్‌ఫగా నిర్ణయించారు. అయితే రాష్ట్రాలవారీగా ఉత్తీర్ణత వివరాలను ఈసారి ఎన్‌టీఏ వెల్లడించలేదు. రాష్ట్రాల మధ్య పాస్‌ పర్సంటేజీలో తేడాలుంటే వివాదాలు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఎన్‌టీఏ ఈ వివరాలను వెల్లడించలేదని తెలుస్తోంది. ఆగ్రాకు చెందిన నిఖర్‌ బన్సల్‌ నీట్‌లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించాడు. బన్సల్‌ కుటుంబంలో అనేక మంది డాక్టర్లు ఉండటం విశేషం. బన్సల్‌ తండ్రి డాక్టర్‌ కాగా, ఒక సోదరుడు ప్రస్తుతం మౌలానా ఆజాద్‌ కాలేజీలో మెడిసిన్‌ చదువుతున్నాడు. 


వివాదాలతో ఆలస్యమైన ఫలితాలు

ఈసారి నీట్‌ విషయంలో అనేక వివాదాలు తలెత్తాయి. ఎగ్జామ్‌ సెంటర్‌ సిబ్బంది కొంతమంది విద్యార్థులకు సహకరించారనే ఆరోపణలు రావడంతో రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రెండు బృందాలను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించలేదని కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పరీక్షలో తమకు తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చారంటూ ఇద్దరు విద్యార్థులు ముంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఇద్దరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఎన్‌టీఏ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో ఎన్‌టీఏ సోమవారం ఫలితాలను ప్రకటించింది. పరీక్ష ఫైనల్‌ ఆన్సర్‌ కీ ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. సోమవారం సాయంత్రం నుంచే విద్యార్థులంతా ఒకేసారి ఫలితాలను చెక్‌ చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ కాసేపు మొరాయించింది. విద్యార్థుల వ్యక్తిగత ఈమెయిల్‌ అడ్ర్‌సలకు కూడా స్కోరు కార్డులను పంపించినట్టు ఎన్‌టీఏ ప్రకటించింది.

Updated Date - 2021-11-02T08:41:09+05:30 IST