తెలంగాణ వారసత్వ పతాక రామప్ప

ABN , First Publish Date - 2021-12-19T05:55:53+05:30 IST

‘తెలంగాణ వారసత్వానికి దక్కిన అపూర్వ గౌరవం రామప్ప దేవాలయం.. తెలుగు నేలపై యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడం కావడం గర్వ కారణం..’ అని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ కితాబునిచ్చారు.

తెలంగాణ వారసత్వ పతాక రామప్ప
రామప్ప శిల్పాలను ఆసక్తిగా తిలకిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

యునెస్కో గుర్తింపు పొందడం గర్వకారణం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
సతీసమేతంగా ఆలయ సందర్శన.. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
ఆలయంలో శిల్పకళ అద్భుతమని కితాబు
విశిష్టతలను వివరించిన ఇన్‌టాక్‌ కన్వీనర్‌ పాండురంగారావు
సీజేఐ వెంట హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, ఇతర న్యాయమూర్తుల రాక


వెంకటాపూర్‌(రామప్ప), డిసెంబరు 18:  ‘తెలంగాణ వారసత్వానికి దక్కిన అపూర్వ గౌరవం రామప్ప దేవాలయం..  తెలుగు నేలపై యునెస్కో గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడం కావడం గర్వ కారణం..’ అని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ కితాబునిచ్చారు.  ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని కాకతీయుల నాటి రామప్ప దేవాలయాన్ని సతీసమేతంగా ఆయన శనివారం సందర్శించారు. సాయంత్రం 5.12 గంటలకు రామప్పకు చేరుకున్న ఆయనకు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీజేఐకి  అర్చకులు సంప్రదాయ తలపాగాను ధరింపజేసి పూలమాలలు వేశారు. పూర్ణకుంభం, వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఘనస్వాగతం పలికారు. ఆలయంలో కొలువుదీరిన రామలింగేశ్వరుడికి సీజేఐ ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రంగమండపంలో సీజేఐ దంపతులకు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి శాలువాతో సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు.

తడుముతూ.. ఆశ్చర్యపడుతూ..
రామప్ప ఆలయ శిల్పాలను సీజేఐ రమణ ఆసక్తిగా తిలకించారు. ఇన్‌టాక్‌ కన్వీనర్‌ పాండురంగరావు, ఆలయ గైడ్లు   ప్రతీ శిల్పానికి సంబంధించిన విశిష్టతను ఆయనకు వివరించారు. ఆలయానికి దక్షిణాన ఉన్న కామేశ్వరాలయాన్ని తిలకిస్తున్న క్రమంలో అక్కడ పోగైన ఇసుక కుప్పను సీజేఐ గమనించారు. మొత్తం రామప్ప ఆలయాన్ని ఇసుక పునాదిపై నిర్మించారని, భూ కంపాలు వచ్చినా ఎటువంటి నష్టం రాకుండా కాకతీయులు ఈ తరహా పరిజ్ఞానాన్ని ఉపయోగించారని పాండురంగారావు తెలిపారు. ఆయోధ్య రామమందిరం నిర్మాణం కూడా శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతోనే నిర్మిస్తున్న విషయాన్ని కూడా వివరించారు.
రంగమండపంలోని ప్రాముఖ్యత కలిగిన స్తంభానికి సూదిమొన దూరేంత రంధ్రాలుండటాన్ని సీజేఐ ఆసక్తిగా గమనించారు. చేతితో తడిమిచూశారు. గర్భగుడికి ఇరువైపులా ఉన్న శిల్పాలు, నాగిని శిల్పాలు, నంది విగ్రహాలను తిలకించారు. గంటపాటు ఆలయ పరిసరాల్లో గడిపిన ఎన్వీ రమణకు మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, సర్పంచ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాలు కప్పి సన్మానించారు. సీతక్క జ్ఞాపికను అందజేశారు. కాకతీయ హెరిటేజ్‌ పుస్తకాన్ని పాండురంగారావు సీజేఐకి అందించారు. షెడ్యూలు ఆలస్యం కావడంతో రామప్ప సరస్సును సందర్శించకుండానే సీజేఐ 6.35 గంటలకు వరంగల్‌కు బయల్దేరి వెళ్లారు.

భారీ భద్రత
సీజేఐ రాక సందర్భంగా రామప్పలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలంపేట ఆర్చ్‌ నుంచి ఆలయం వరకు, చుట్టుపక్కల ప్రదేశాల్లో సాయుధ పోలీసులు పహారా కాశారు. ములుగు ఏఎస్పీ సుధీర్‌ ఆర్‌.కేకాన్‌, ఓఎస్డీ శోభన్‌కుమార్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీజేఐ పర్యటనకు ఒకరోజు ముందే ఆలయ పరిసరాలను తనిఖీ చేశారు. బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో పరిశీలించారు. ములుగు అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులతో కలిసి ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీజేఐ రామప్ప పర్యటనలో వరంగల్‌ జిల్లా తొమ్మిదో అదనపు జడ్జి అనిల్‌కుమార్‌, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ మహే్‌షనాథ్‌, ములుగు జూనియర్‌ జడ్జి రామచందర్‌రావు, డీఆర్వో కె.రమాదేవి, తహసీల్దార్‌ మంజుల, స్థానిక సర్పంచ్‌ రజిత, జడ్పీటీసీలు రుద్రమదేవి, భవాని పాల్గొన్నారు.

వెంట వచ్చిన న్యాయమూర్తులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వెంట తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీ్‌షచంద్ర శర్మతోపాటు న్యాయమూర్తులు ఉజ్జల్‌ భూయాన్‌, రాజశేఖరరెడ్డి, పి.నవీన్‌రావు తదితరులు వచ్చారు. అదే విధంగా ముందే రామప్పకు చేరుకున్న తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌, జలవనరుల పరిరక్షణ సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, స్థానిక ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు సీజేఐకి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయ సందర్శన అనంతరం ఆయనతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నిట్‌ క్యాంపస్‌కు విచ్చేసిన సందర్భంగా శనివారం రాత్రి సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు.  పలువురు కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా సీజేఐని ఆకట్టుకున్నారు.  ఈ కార్యక్రమంలో సీజేఐ దంపతులతో పాటు  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్రశర్మ, పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌,  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. సీజేఐ రాకతో నిట్‌లో పెద్ద ఎత్తున సందడి ఏర్పడింది.Updated Date - 2021-12-19T05:55:53+05:30 IST