కళ్లు చెదిరే ధర.. కన్నీళ్లు మిగిల్చిన దిగుబడి!

ABN , First Publish Date - 2021-10-28T08:08:20+05:30 IST

కళ్లు చెదిరే ధర.. కన్నీళ్లు మిగిల్చిన దిగుబడి!

కళ్లు చెదిరే ధర.. కన్నీళ్లు మిగిల్చిన దిగుబడి!

  • క్వింటా పత్తి ధర 8వేలకు పైనే.. ప్రస్తుతం సీసీఐ మద్దతు కన్నా 2వేలు ఎక్కువే
  • అయినా ఆ ప్రయోజన ఫలం దక్కని పత్తి రైతులు.. కొంపముంచిన వర్షాలు
  • ఎకరానికి 3-4 క్వింటాళ్లే.. పంట పెట్టుబడి డబ్బులూ చేతికి రాని దైన్యం
  • రాష్ట్రంలో 46.42 లక్షల ఎకరాల్లో సాగు.. 12.8 లక్షల ఎకరాల్లో నష్టం
  • పత్తి పంట ఏరించడం పెను భారం.. కూలీలు దొరక్క సమస్య
  • కిలోకు రూ.12 చొప్పున కూలీ..  ఆటో కిరాయికి రూ.1000 అదనం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో పత్తి ధర పైపైకి పోతోంది. సీసీఐ మద్దతు కన్నా కొన్నిచోట్ల గరిష్ఠంగా రెండువేల దాకా ఎక్కువే వస్తోంది. రానున్న రోజుల్లో క్వింటా పత్తికి రూ.10వేల దాకా చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లోనైతే రైతు పంట పండినట్లే అనుకోవాలి. కానీ పత్తిరైతు ఆనందపడే పరిస్థితులు లేవు. ప్రస్తుతం రూ.8వేల పైచిలుకు ధర ఉన్నా రైతుకు ఆశించినంత దిగుబడి రాలేదు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో భారీ వర్షాలు రైతులను కుంగదీశాయి. 2-3 వారాల పాటు వరుసగా వర్షాలు పడడంతో పంటకు తీవ్ర నష్టం జరిగింది. తొలకరి మురిపించి.. వేసిన విత్తనంవేసినట్లు మొలకెత్తి. చేనంతా పచ్చగా నవనవలాడు తూ మొగ్గతొడిగి కాయలు వేస్తున్న దశలో కురిసిన వర్షాలతో పంటను దెబ్బతీశాయి. రైతు గుండె చెరువైం ది. ఎకరానికి గరిష్ఠంగా 10-15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 3-4 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. ధరలు పెరిగినా సంబరపడే పరిస్థితులు లేవని, పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 46.42 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. భారీ వర్షా లవల్ల  12.8 లక్షల ఎకరాల్లో  తీవ్ర నష్టం జరిగింది. సాధారణంగా చెలక భూమిలో మొక్కకు 70-80 కాయలు కాస్తాయి. నల్లరేగడిలో 100 దాకా కాసాయి. ఈసారి 30-40 కాయలే కాశాయి. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌ వల్ల పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కొంత మేర నష్టం జరిగింది. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోనే రూ.2.5 కోట్ల నష్టం జరిగింది. 


ఎకరానికి రూ.10వేల గిట్టుబాటు! 

దుక్కులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందు లు, కలుపుతీత,  పత్తి పంట ఏరివేతకు కూలీల ఖర్చు కు ఎకరానికి పెట్టుబడి రూ.20-22 వేల దాకా అవుతుంది.  ఎర్రనేలల్లో ఎకరానికి గరిష్ఠంగా 10 క్వింటాళ్లు, నల్లరేగడి నేలల్లో 13-14 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. ఈసారి భారీ వర్షాలతో దిగుబడి 3-4 క్విం టాళ్లకే పరిమితమైంది. అంటే క్వింటాకు రూ.8వేల ధర అనుకున్నా.. ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి పొందిన రైతుకు చేతికొచ్చేది రూ.32వేలు మాత్రమే. పెట్టుబడి రూ.22వేలు పోనూ మిగిలేది రూ.10వేలే. పెట్టుబడిని అప్పుగా తెస్తే  ఆ మొత్తం వడ్డీకే పోతుంది.  కౌలుకు ఇచ్చినా ఎకరానికి రూ.15-20 వేలు వచ్చేవని రైతులు వాపోతున్నారు. ఇక పత్తి ఏరించడం రైతులకు సమస్యగా మారుతోంది. కూలీలు దొరకడం లేదు. దొరికినా భారీగా చెల్లించాల్సి వస్తోంది. కిలోపత్తికి కూలీ రూ.12-13 నడుస్తోంది. కూలీలు పొరుగూరోళ్లయితే రానుపోనూ ఆటో కిరాయి కోసం రూ.1000 అదనంగా ఇచ్చుకోవాల్సి వస్తోంది.

మిగతా పంటలకూ నష్టం

వర్షాల వల్ల పత్తితో పాటు వరి, మిర్చి మొక్కజొన్న, సోయా తదితర పంటలకూ తీవ్ర నష్టం జరిగింది. అయితే, పంట నష్టం లెక్కలకు వాస్త వ పరిస్థితులకు అసలు పొంతన లేదన్న విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 5.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా 16 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అధికారులు చెప్పారు. ఈ జిల్లాలో ఒక్క పత్తి పంటే 92వేల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, 13వేల ఎకరాల్లో సోయా పంటకు నష్టం జరిగిందని చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో 4.17 లక్షల ఎకరాలు సాగుచేయగా, 9,500 ఎకరాల్లో పత్తి, 2679 ఎకరాల్లో వరి, 2,544 ఎకరాల్లో సోయా, 1,338 ఎకరాల్లో మొక్కజొన్న, 1,418 ఎకరాల్లో పసుపు పంటకు నష్టం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 10,146 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 30వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 2,321 ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 6,182 ఎకరాల్లో, సిరిసిల్ల జిల్లాలో 7,707 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌తో మంథని, రామగిరిలో 1100 ఎకరాల్లో వరి, 100కుపైగా ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 


ఎకరానికి 2-3 క్వింటాళ్లే 

నాకున్న ఐదు ఎకరాల్లో పత్తి  వేశాను. రూ.1.5లక్షలు ఖర్చు పెట్టాను. ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. అధిక వర్షాలతో పూత రాలిపోయింది. పంట ఎర్రబడి పోవడంతో దిగుబడి రాలేదు. ఒకేసారి పత్తిని ఏరడంతో పంటను తీసి వేసే పరిస్థితి ఏర్పడింది. 

- రమేశ్‌, ఆదిలాబాద్‌ జిల్లా, డోర్లి గ్రామం


ఈసారి 30  క్వింటాళ్ల లోపే 

నేను 12ఎకరాల్లో పత్తి పంట, రెండెకరాల్లో సోయా పంట వేశాను. భారీ వర్షాలతో పత్తి పంట దెబ్బతింది. 30 క్వింటాళ్ల  దిగుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. పెట్టిన పెట్టుబడి రూ.2.5లక్షలు వచ్చే పరిస్థితి లేదు. నిరుడు 12ఎకరాల్లోనే పత్తి సాగు చేయగా 90క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. 

 - సాయినాథ్‌, నిర్మల్‌ జిల్లా ముథోల్‌


Updated Date - 2021-10-28T08:08:20+05:30 IST