తప్పుల తడకలుగా ఉపాధ్యాయుల కేటాయింపులు

ABN , First Publish Date - 2021-12-20T05:07:42+05:30 IST

తప్పుల తడకలుగా ఉపాధ్యాయుల కేటాయింపులు

తప్పుల తడకలుగా ఉపాధ్యాయుల కేటాయింపులు
హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు

సీనియర్లను కాదని జూనియర్లకు అందలం

భగ్గుమన్న ఉపాధ్యాయులు..  కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

వరంగల్‌ సిటీ, డిసెంబరు 19: విభజన ప్రక్రియలో భా గంగా చేపట్టిన ఉపాధ్యాయుల జిల్లాల  కేటాయింపుల్లో శుద్ధ తప్పులు దొర్లినట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నోడల్‌ అధికారి నారాయణరెడ్డి నిర్లక్ష్య వైఖరికి అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన కేటాయింపుల జాబితాలే నిదర్శనంగా మారాయని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మార్గదర్శకాలను అనుసరించకుండా, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించకుండా ఆయనకు నచ్చినట్టుగా సీనియారిటీ లిస్టులను రూపొందించడం వలన  జిల్లాల కేటాయింపుల్లో అనేక తప్పులు దొర్లినట్లు వారు విమర్శిస్తున్నారు. అశాస్త్రీయమైన, అసంబద్ధమైన కేటాయింపులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నట్లు వారు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెబ్‌సైట్‌లో ఉంచిన కేటాయింపుల జాబితాలు పూర్తిగా తప్పులుగా ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆదివారం ఉదయమే హనుమకొండలోని కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో అభ్యంతరాలను స్వీకరించేందుకు నోడల్‌ అధికారి డీఈవో కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. 

కేటాయింపుల లిస్టులన్నీ తప్పులే..

వివిధ కేటగిరీల్లో విడుదలైన కేటాయింపుల జాబితాలన్నింటిలో తప్పులు దొర్లినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీనియారిటీ లిస్టులు ప్రదర్శించకుండా, ఉపాధ్యాయుల అభ్యంతరాలు స్వీకరించకుండా కేటాయింపులు జరుపడం వల్లనే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు అంటున్నారు. సీనియారిటీ జాబితాల తయారీలో కొంతమంది ఉపాధ్యాయులు పాల్గొనడంవల్ల వారికి సంబంధించిన వారికి అనువుగా ఉండే జిల్లాల కోసం సీనియర్లను కాదని జూనియర్లకు వారికి అనువుగా ఉండే జిల్లాల కేటాయింపు జరిగిందని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని కేటగిరీల కేటాయింపుల జాబితాల్లో సీనియర్లను కాదని జూనియర్లకు అనువైన జిల్లాలు కేటాయించినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇక ప్రిఫరెన్షియల్‌ కేటగిరీల్లోనూ చాలామందికి అన్యాయం జరిగినట్లు డీఈవో కార్యాలయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. 

బోధనేతర సిబ్బంది జాబితా ఏదీ?

ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు కంటే మూడు రోజుల ముందుగానే తయారైన జిల్లా కేడర్‌ బోధనేతర సిబ్బంది కేటాయింపు జాబితాను ఆదివారం వరకు విడుదల చేయలేదు. సంబంధిత సెక్షన్‌ సిబ్బందిని జాబితా విషయమై అడిగితే డీఈవో వద్దనే ఉందనే సమాధానం చెబుతున్నారు. అయితే బోధనేతర సిబ్బంది జాబితా విడుదల జాప్యం వెనుక ఏమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేలసంఖ్యలో ఉన్న ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసిన అధికారులు కేవలం 142మంది ఉన్న జాబితాను ఎందుకు విడుదల చేయడం లేదని ఆయా కేటగిరీల ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత సెక్షన్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే లిస్టు విడుదలలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇవీ ఉదాహరణలు

 పీఎస్‌ హెచ్‌ఎంల లిస్టులో 118 క్రమ సంఖ్య కలిగిన కా సర్ల సురేందర్‌ అనే ఉపాధ్యాయుడు హనుమకొండ, వ రంగల్‌ తదితర అప్షన్లు ఎంచుకోగా ఆయనకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను కేటాయించారు. అదే లిస్టులో 220, 221 క్రమ సంఖ్యలోని జూనియర్‌ ఉపాధ్యాయులకు మాత్రం వరంగల్‌ జిల్లాను కేటాయించారు. 

 సిద్ధిపేట జిల్లాలో ఒకే ఒక్క పీడీ పోస్టు ఉండగా సీనియారిటీ జాబితాలో అర్హుడైన ఎల్‌.సత్యనారాయణ కోరుకున్నప్పటికీ ఆయనకు మహబూబాబాద్‌కు కేటాయించి సిద్ధిపేటలోని పోస్టును ఖాళీగానే ఉంచారు. 

 పీఈటీల లిస్టులో 186 క్రమసంఖ్యలో ఉన్న సీహెచ్‌.సరస్వతి అనే ఉపాధ్యాయురాలికి జనగామ ఆప్షన్‌ ఇస్తే.. అది కేటాయించకుండా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ను కేటాయించారు. ఇదే లిస్టులో జూనియర్లకు మాత్రం జనగామ, వరంగల్‌ జిల్లాలను కేటాయించారు. 

 ఇలాగే ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ ఇంగ్లీ్‌షతో సహా అన్ని లిస్టుల్లో ఇదే గందరగోళం నెలకొందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. 

ప్రిఫరెన్షియల్‌ కేటగిరీల్లో..

 హసన్‌పర్తి మండలంలోని పెంబర్తి జడ్‌పీహెచ్‌ఎ్‌సలో పనిచేస్తున్న ముక్కెర సదానందంకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయ్యింది. ఆయనకు ఫ్రిఫరెన్షియల్‌ కేటగిరీ ప్రకారం కేటాయింపు జరపాల్సి ఉండగా సర్టిఫికెట్‌ 

సమర్పించినా ఆ కేటగిరీ కింద కేటాయింపు జరగలేదు. 

ఫ 2017 టీఆర్టీలో ఎంపికై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పంచగిరి సంగీత అనే వికలాంగ ఉపాధ్యాయురాలిని ఫ్రిఫరెన్షియల్‌ కేటగిరీలో ఎస్జీటీ తెలుగు మీడియంలో కేటాయింపు చేయాల్సి ఉండగా ఇంగ్లీష్‌ మీడియంలో కేటాయించారు. 

ఫ ఇల్లంద జడ్‌పీహెచ్‌లో పనిచేస్తున్న మంద ప్రభాకర్‌ అనే ఉపాధ్యాయుడు న్యూరో సర్జరీ అయిన మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించినా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో కేటాయించకపోవడం వల్ల మహబూబాబాద్‌ జిల్లాలో కేటాయింపు జరిగింది. 

ఫ హిందీ ఉపాధ్యాయురాలు విజయజ్యోతికి క్యాన్సర్‌ సర్జరీ అయినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించినా ఫ్రిఫరెన్షియల్‌ కేటగిరీలో కేటాయింపు జరుగలేదు.



Updated Date - 2021-12-20T05:07:42+05:30 IST