సింగరేణిలో టీబీజీకేఎస్ సమ్మె సైరన్
ABN , First Publish Date - 2021-11-26T09:42:39+05:30 IST
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణి యాజమాన్యానికి గురువారం సమ్మె నోటీసు ఇచ్చింది.

గోదావరిఖని, నవంబరు 25: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణి యాజమాన్యానికి గురువారం సమ్మె నోటీసు ఇచ్చింది. గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు వెళ్లనున్నట్టు యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్, డైరెక్టర్ బలరాం, జీఎం పర్సనల్‌తో పాటు రీజనల్ లేబర్ కమిషర్‌కు సమ్మె నోటీసు పంపారు. కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బ్లాక్‌ల వేలాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. డిసెంబరు 9 తర్వాత సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చే సుకున్న కార్మికుల వారసుల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40కి పెంచాలని, అలియాస్ పేర్ల మార్పిడి చేయాలని, కొవిడ్ కారణంగా మెడికల్ బోర్డు నిర్వహణలో ఆలస్యం జరిగిన కారణంగా 35 ఏళ్లు దాటిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని సమ్మె నోటీసులో వెంకట్రావు డిమాండ్ చేశారు.