దుర్భరంగా దర్జీల జీవనం
ABN , First Publish Date - 2021-02-27T05:07:29+05:30 IST
దుర్భరంగా దర్జీల జీవనం

కరోనా కాటుతో టైలర్స్ దుకాణాలు వెలవెల
28న టైలర్స్ డే
కాజీపేట టౌన్, ఫిబ్రవరి 26 : ఏళ్ళతరబడి వంశపారంపర్యంగా కొనసాగుతున్న కుల వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న దర్జీలు (మేర కులస్థులు) ఎదుగు బొదుగూ లేని జీవితాన్ని గడుపుతున్నారు. దర్జీ పనిపై ఆధారపడిన అనేక మంది అరకొర ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నాయి. నేటి ఆధునిక యుగంలో టైలర్స్ పరిస్థితి దుర్భరంగా మారింది. టైలర్స్పై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డేను పురస్క రించుకుని ’ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం
పండుగలు వస్తేనే చేతి నిండా పని..
ప్రతీ ఏడాది వచ్చే పండుగల సమయంలో మాత్రమే టైలర్స్‌కు చేతి నిండా పని దొరికే పరిస్థితి నెలకొంది. వంశపారంపర్యంగా వచ్చే వారి (మేర కులస్థులు)తో పాటు ఇతరులు కూడా టైలరింగ్‌ను నేర్చుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో వారి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంటుంది. టైలరింగ్ వచ్చిన వారు గ్రామాల నుంచి నగరానికి చేరుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టైలర్ షాపుల్లో కార్మికులుగా పని చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. నగరంలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో దాదాపు 1000కి పైగా టైలర్ షాపులు ఉన్నాయి. అలాగే అడుగడుగునా రెడిమేడ్ దుస్తుల దుకాణాలు కూడా ఉన్నాయి.
రెడీమేడ్ వ్యాపారంతో..
రోజురోజుకూ రెడీమేడ్ వస్ర్తాల వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. నేటి యువత కూడా రెడీమేడ్ వస్త్రాలనే ఎక్కువగా కొనడాని ఇష్టపడుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు రెడీమేడ్ దుస్తుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో టైలర్ దుకాణాలకు వెళ్ళి దుస్తులను కుట్టించుకునే వారి సంఖ్య నానాటికి తగ్గుముఖం పడుతోంది. రంగులతోపాటు ఆకట్టుకునే డిజైన్లతో కూడిన వస్త్రాలు లభిస్తుండడంతో కూడా ధర ఎక్కువైనా రెడీమేడ్ దుస్తులనే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుండడంతో టైలర్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.
ప్రభుత్వ తీరుపై..
దర్జీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమంపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా దర్టీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్రభావంతో గిరాకీలులేని పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని పలువురు టైలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో దుకాణాలను మూసివేసినా అద్దెలను చెల్లించి అప్పులపాలైయమని వాపోతున్నారు.
కరెంట్ బిల్లులను మాఫీ చేయాలి
ఆదిమూలం శ్రీనివాస్, కాజీపేట టైలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ఉపాధిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్జీల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. కరోనా ప్రభావంతో కనీసం కరెం ట్ బిల్లులను చెల్లించలేని ఆర్థిక దుస్థితి మాది. కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దర్జీలకు బ్యాంకుల నుంచి రుణాలను అం దించి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలి. రేషన్‌కార్డు, ఆసరా ఫించన్లతో పాటు డబుల్ బెడ్ రూమ్‌లను కేటాయించాలి. ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.