సాంకేతికతతో సర్వే!

ABN , First Publish Date - 2021-06-04T10:05:50+05:30 IST

డిజిటల్‌ సర్వే.. భూ తగాదాలు లేని భవిష్యత్తు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చిన కార్యక్రమమిది. భూమి సరిహద్దుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి

సాంకేతికతతో సర్వే!

డిఫరెన్షియల్‌ జీపీఎస్‌ ప్రకారం భూమి లెక్కలు..

అక్షాంశాలు, రేఖాంశాలతో పక్కాగా కొలతలు

హద్దు చూపడానికి రైతు, పక్క పొలం రైతు

రోజుకు 50’ ఎకరాలు సర్వేకు అవకాశం


హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ సర్వే.. భూ తగాదాలు లేని భవిష్యత్తు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరపైకి తీసుకొచ్చిన కార్యక్రమమిది. భూమి సరిహద్దుల అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి పట్టాదారుకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పిస్తామని చెప్పారు. దాంతో, సర్వే ఎలా చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజాం హయాంలో హైదరాబాద్‌ సంస్థానంలో చైన్‌ అండ్‌ క్రాస్‌ టాప్‌ మెథడ్‌ (గొలుసు) ఆధారంగా భూముల సరిహద్దులను కొలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో భూ భారతి ప్రాజెక్టు కింద శాటిలైట్‌ ఇమేజ్‌లు వాడి సర్వే చేశారు. కానీ, ఇప్పుడు సర్కారు డిజిటల్‌ ల్యాండ్‌ సర్వే చేయనుంది. అంటే, డిఫరెన్షియల్‌ జీపీఎస్‌ (డీజీపీఎ్‌స)కు మొగ్గు చూపనుంది. దీని ప్రకారం, ఒక రైతు భూమి అక్షాంశాలు, రేఖాంశాలను పక్కాగా కొలిచి ఇవ్వడానికి అవకాశం ఉంది. డీజీపీఎస్‌ పద్ధతిలో సర్వే చేయాలంటే అందులో కీలకమైన బేస్‌ను ఒకచోట అమర్చాలి. ఇక్కడ ఒక సహాయకుడు ఉంటాడు.


రోవర్‌ అనే మరో పరికరాన్ని సర్వేయర్‌ తీసుకుంటాడు. రైతు సరిహద్దుల చుట్టూ తిరుగుతూ... రిమోట్‌ను క్లిక్‌ చేస్తాడు. అప్పుడు ఆ సరిహద్దుల రికార్డులన్నీ పక్కాగా రికార్డు అవుతాయి. అయితే, ఇక్కడ సరిహద్దులు చూపడానికి సదరు పొలం రైతు/ పక్క పొలం రైతు కూడా ఉండాలి. దీనికితోడు, రెవెన్యూ సహాయకుడు కూడా రికార్డులతో సిద్ధంగా ఉండాలి. ఇలా ఒక బృందం రోజుకు 50 ఎకరాలను సర్వే చేయగలుగుతుంది.


వివాదాలు పరిష్కారమయ్యేనా!?

ఎటువంటి భూ వివాదాలు లేని 27 గ్రామాల్లో తొలుత సర్వే చేస్తామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. అక్కడ వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్త సర్వేకు శ్రీకారం చుట్టనున్నారు. నిజానికి, నిజాం అధికారంలో ఉండగా.. హైదరాబాద్‌ సంస్థానంలో గొలుసు ఆధారంగా భూముల సరిహద్దులను కొలిచారు. ప్రతి సర్వే నంబర్‌ విస్తీర్ణానికి భూమి సరిహద్దుల రికార్డుల పత్రం (టిప్పన్‌) రాశారు. దాదాపు 90 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా దీని ఆధారంగానే సర్వే చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అప్పటితో పోలిస్తే భూమి స్వభావం మారిపోయింది. యజమానులు మారిపోయారు. విస్తీర్ణాలు కూడా ఏకరీతిగా లేవు. అయినప్పటికీ, దాదాపు 80 శాతం వరకూ భూములకు సంబంధించి పెద్దగా వివాదాలు రాకపోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాటికి సంబంధించి సర్వే నంబర్లు, యజమానులు, రికార్డులు ఎంతో కొంత పక్కాగా ఉండడమే దీనికి కారణం.


ఇక, మిగిలిన 20 శాతంలో గట్ల పంచాయతీలు ఉండేవారు. ప్రభుత్వ బంజరు, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూముల పక్కన ఉండే భూముల వివాదాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటువంటి వివాదాలను ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. కొన్నిచోట్ల రికార్డుల్లో ఐదెకరాలుంటే.. క్షేత్రస్థాయిలో కొంచెం అటుఇటుగా ఉంది. టిప్పన్‌ను ప్రామాణికం చేసుకుంటే.. రికార్డుల ప్రకారం ఎంత విస్తీర ్ణం ఉంటే అంతే విస్తీర్ణం కొలిచి ఇవ్వడం లేదా అదనంగా ఉన్న భూమికి రికార్డులను నిరాకరించడం చేయాల్సి ఉంటుంది. రికార్డుల ప్రకారం విస్తీర్ణం కొలిచి ఇస్తారా? లేక విస్తీర్ణం ప్రకారం రికార్డులను మారుస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పలువురు కోర్టులను ఆశ్రయించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.  


చట్టం లేకే భూభారతికి స్వస్తి

భూముల సరిహద్దులన్నీ పక్కాగా కొలిచి.. ప్రతి భూమిని సర్వే చేసి, భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికి వీలుగా 2006 మే 1వ తేదీన భూభారతి ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం నిజామాబాద్‌లో చేపట్టింది. జిల్లాలో 911 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి.. 390 గ్రామాల్లో భూ వివాదాలు/ అభ్యంతరాలను పరిశీలించి.. 60 గ్రామాల భూ రికార్డులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. మరో 171 గ్రామాలకు నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉంది. ఇక్కడ కూడా శాటిలైట్‌ టెక్నాలజీతో ఫొటోలు తీసి... ప్రతి గ్రామంలో సర్వే చేశారు. కానీ, రైతుల చేతిలో ఉన్న భూములకు, రికార్డుల్లో ఉన్న భూములకు తేడాలు వచ్చాయి. దీనిపై రైతులు ఆందోళనలు వ్యక్తం చేశారు. దాంతో, ప్రాజెక్టుకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు కూడా ఇటువంటి వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వం వాటినెలా పరిష్కరిస్తుందన్నదే ప్రశ్న.


చట్టం తెస్తేనే సర్వేతో ప్రయోజనం

భూభారతి ప్రాజెక్టు ఆగిపోవడానికి ప్రధాన కారణం చట్టం లేకుండా సర్వే చేయడమే. భూముల సర్వే చేసినా.. రికార్డులకు, భూమికి మధ్య అంతరం చూపిస్తుండటం వల్లే ఆ రికార్డులను అమలు చేయలేక నిజామాబాద్‌లో భూభారతి ప్రాజెక్టును పక్కనపెట్టారు. 30 ఏళ్లకు ఒకసారి సర్వే చేయాలని పెట్టుకున్న నిబంధనకు ప్రధాన కారణం ఎప్పటికప్పుడు భూమి స్వభావం, భూ యజమానులు మారడమే. ఇక, భూముల సర్వేను ఏ ప్రాతిపదికన చేస్తారు? అందులో వచ్చే అభ్యంతరాల మాటేమిటి? వంటి వాటిపై సర్వేకు ముందే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రికార్డులను ప్రామాణికం చేసుకుంటారా? వాస్తవ విస్తీర్ణం పరిగణనలోకి తీసుకుంటారో చెప్పాలి. అప్పుడే సర్వేతో ప్రయోజనం కలుగుతుంది. 2017లో భూముల వద్దకు వెళ్లకుండానే భూ రికార్డుల నవీకరణ చేశారు. ఆ లెక్క ప్రకారం ఇచ్చిన పత్రాలకు, రైతు చేతిలో ఉన్న విస్తీర్ణం మధ్య తేడాలున్నాయి. ధరణి రికార్డుల ఆధారంగా ముందుకెళితే... రైతు చేతిలో ఉన్న భూమినే కొలిచి ఇస్తారా...? లేక రైతు వద్ద ఉన్న రికార్డుల్లోని భూమి అంతా కొలిచి ఇస్తారా ముందే తేల్చాలి. ఇక ప్రతి గ్రామంలో భూముల వివాదాలను పరిష్కరించే వ్యవస్థను కూడా ప్రభుత్వం పెట్టాలి.

 ప్రొఫెసర్‌ సునీల్‌ కుమార్‌, భూమి చట్టాల 

నిపుణుడు, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం

Updated Date - 2021-06-04T10:05:50+05:30 IST