మా భూముల్లో సర్వేనా?

ABN , First Publish Date - 2021-05-08T07:51:08+05:30 IST

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్‌ గ్రామపరిధిలో ఉన్న తమ భూముల్లో అధికారులు సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ సదా సత్యనారాయణరెడ్డి, మరో నలుగురు రైతులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు.

మా భూముల్లో సర్వేనా?

  • ప్రభుత్వ జీవోను రద్దు చేయండి
  • అధికారులు అక్రమంగా వస్తున్నారు
  • హైకోర్టుకు దేవరయాంజాల్‌ రైతులు
  • నేడు విచారణకు రానున్న పిటిషన్‌


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్‌ గ్రామపరిధిలో ఉన్న తమ భూముల్లో అధికారులు సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ సదా సత్యనారాయణరెడ్డి, మరో నలుగురు రైతులు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల సర్వేకు ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన జారీచేసిన జీవో 1014ను రద్దుచేయాలని హౌస్‌ మోషన్‌ పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో జీఏడీ, పురపాలకశాఖ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శులు, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ స్పెషల్‌  ఆఫీసర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. తమ భూములను స్వాధీనం చేసుకోవడానికి 2005లో అధికారులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకొనేందుకు తాము అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించామన్నారు.


2010 ఆగస్టు 26న హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. ఈ భూములకు సంబంధించి ఆలయానికి ఎలాంటి హక్కులు లేవని, పిటిషనర్లను ఖాళీ చేయించరాదని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. ఈ భూములను ఆక్రమించుకొనే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఒక కమిటీని నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం మరో జీవో జారీచేసిందన్నారు. అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ రోజూ తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ ముందు తమ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు జారీచేసిందన్నారు. వీటిపై తాము 2019 నవంబర్‌ 28న హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యాజ్యంలో హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందన్నారు. దేవరయాంజల్‌ గ్రామ పరిధిలో పలు సర్వే నెంబర్లల్లోని భూములను రిజిస్టర్డు సేల్‌ డీడ్స్‌ ద్వారా తాము కొనుగోలు చేసినట్లు పిటిషనర్లు తెలిపారు. భూములపై హక్కులు రుజువు చేసుకొనే వరకు పిటిషనర్లను ఖాళీ చేయించొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే పేరుతో ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం శనివారం ఉదయం హైకోర్టు ముందుకు విచారణకు రానుంది.

Updated Date - 2021-05-08T07:51:08+05:30 IST