అనాథలకు స్కూలు ఫీజులు రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-08-27T10:12:36+05:30 IST

అనాథలకు స్కూలు ఫీజులు రద్దు చేయండి

అనాథలకు స్కూలు ఫీజులు రద్దు చేయండి

  • లేదా సగం ఫీజు మీరే భరించండి
  • దీనిపై ప్రైవేటు స్కూళ్లతో మాట్లాడండి
  • కేంద్ర సాయం కూడా కోరవచ్చు
  • రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీం కోర్టు
  • అవసరమైతే మీరూ బాధ్యత తీసుకోవాలి
  • కేంద్రాన్ని కోరిన ధర్మాసనం


న్యూఢిల్లీ, ఆగస్టు 26: కరోనా పరిస్థితుల నేపథ్యంలో అనాథ పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రైవేటు స్కూళ్లు అనాధ పిల్లలకు ఫీజులు మాఫీ చేసేలా చూడాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. లేనిపక్షంలో సగం ఫీజును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని పేర్కొంది. ఫీజుల ఖర్చును భరించాల్సిందిగా కేంద్రాన్ని కూడా కోరవచ్చని రాష్ట్రాలకు తెలిపింది. ఈ విషయంలో పిల్లల సంరక్షణ కేంద్రాలు, జిల్లా విద్యాధికారులతో కలిసి పనిచేయాలని సూచించింది. కనీసం ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఫీజులు రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. గతేడాది పిల్లల సంరక్షణ కేంద్రాల్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సుప్రీం కోర్టు అనాథ పిల్లల అంశాన్ని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారడాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకొంది. ఈ అంశంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.


ఆంధ్ర ప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకొని ధర్మాసనం మొదట తీర్పు వెలువరించడం  ప్రారంభించింది. ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. కరోనా వల్ల తల్లిదండ్రులిద్దరినీ, లేదా ఒకరిని కోల్పోయిన పిల్లల వివరాలను జాతీయ బాలల హక్కుల కమిషన్‌ నిర్వహిస్తున్న బాల స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించింది. ఈ విషయంలో స్థానిక అధికారులకు, సంస్థలకు మార్గదర్శకాలను జారీచేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌లను ధర్మాసనం ఆదేశించింది. అనాధ పిల్లల కోసం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేంద్రం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఇందులో 2,600 మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 418 మంది దరఖాస్తులను మేజిస్ట్రేట్లు ఆమోదించారని ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన దరఖాస్తులను కూడా ఆమోదించాలని ధర్మాసనం ఆదేశించింది. అవసరమైతే ఈ పిల్లల చదువు బాధ్యతను కేంద్రం కూడా తీసుకోవాలని పేర్కొంది.

Updated Date - 2021-08-27T10:12:36+05:30 IST