తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయి
ABN , First Publish Date - 2021-10-29T08:32:33+05:30 IST
ఆత్మహత్యల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2020లో రాష్ట్రంలో 8,058 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో 5893 మంది పురుషులు, 2164 మంది మహిళలు కాగా ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
- ఆత్మహత్యల్లో 8.. రైతుల బలవన్మరణాల్లో 3వ స్థానం
- నిరుడు రాష్ట్రంలో 8,058 మంది బలవన్మరణం: ఎన్‌సీఆర్‌బీ
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యల్లో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2020లో రాష్ట్రంలో 8,058 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారిలో 5893 మంది పురుషులు, 2164 మంది మహిళలు కాగా ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. 2019తో పోలిస్తే ఆత్మహత్యలు 5ు పెరిగాయి. ‘భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాలు-ఆత్మహత్యలు-2020’ నివేదికను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గురువారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. తెలంగాణలో ప్రతి లక్ష జనాభాలో 21.1 మంది, దేశవ్యాప్తంగా 11.1 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 5.3శాతంగా ఉంది. రాష్ట్రంలో అప్పులు తీర్చలేక నిరుడు 947 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే 471 మంది రైతులు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో కౌలు రైతులు 123 మంది ఉండగా.. వ్యవసాయ కూలీలు ఐదుగురు ఉన్నారు. రైౖతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. అన్నదాతల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర(2,324) మొదటి స్థానంలో, కర్ణాటక (1,035) రెండో స్థానంలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో గత ఏడాది 150 మంది నిరుద్యోగులు, 630 మంది గృహిణులు, 120 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 489 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యధికంగా రోజుకూలీలు 3,831 మంది తనువు చాలించారు.
మొత్తం ఆత్మహత్యల్లో పెళ్లికాని వారు 1,518 మంది, పెళ్లయిన వారు 6132, విడాకులు తీసుకున్నవాళ్లు 61 మంది ఉన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా 41 మంది చనిపోగా.. వారిలో 20 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో 66 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో 950 మంది, ఎయిడ్స్‌తో 15 మంది, డ్రగ్స్‌కు బానిసలై 77 మంది, ప్రేమ విఫలమై 193 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
అతివేగానికి 5,460 మంది బలి
నిరుడు తెలంగాణలో మొత్తం 19,505 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాల్లో 7,219 మంది చనిపోయారు. వారిలో 5,460 మంది అతివేగానికి బలయ్యారు. 1,328 ప్రమాదాలకు మద్యం మత్తే కారణం. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రైలు ప్రమాదాల్లో 337 మంది మరణించారు. 2019తో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాలు 11ు తగ్గాయి. రైల్వే ప్రమాదాలు కూడా సగానికి తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో నిరుడు ఒక్క డిసెంబరులో అత్యధికంగా 2,295 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్‌లో అతితక్కువగా 458 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.