ఒకేసారి చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-29T08:20:12+05:30 IST
ఆ ముగ్గురు యువతులూ ప్రాణ స్నేహితులు. వాళ్ల మధ్య కష్టసుఖాలు పంచుకునేంత సాన్నిహిత్యం ఉంది. పైగా.. సమీప బంధువులు కూడా. నివాసమూ ఒకే ప్రాంతంలో. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఆ ముగ్గురు స్నేహితులకూ..
- ముగ్గురూ బంధువులు.. ఆపై ప్రాణ స్నేహితులు
- మృతుల్లో ఇద్దరు వివాహితులు, ఓ విద్యార్థిని
- అనారోగ్యమే కారణమంటున్న కుటుంబసభ్యులు
- కాల్ డేటా పరిశీలిస్తే నిజాలు వెలుగులోకి
- వస్తాయంటున్న స్థానికులు.. జగిత్యాలలో ఘటన
జగిత్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు యువతులూ ప్రాణ స్నేహితులు. వాళ్ల మధ్య కష్టసుఖాలు పంచుకునేంత సాన్నిహిత్యం ఉంది. పైగా.. సమీప బంధువులు కూడా. నివాసమూ ఒకే ప్రాంతంలో. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఆ ముగ్గురు స్నేహితులకూ.. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు కుటుంబాలను ఒకేసారి విషాదంలోకి నెట్టేశారు. ఇంతకీ.. వాళ్లకొచ్చిన ఆ కష్టమేంటి? అంత చిన్న వయసులోనే.. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్న పోలీసులను.. వారి కుటుంబసభ్యులు చెప్పిన సమాధానం.. ఆశ్చర్యపరిచింది. అనారోగ్య కారణాలతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మూడు కుటుంబాల వారూ ఒకే మాట చెప్పడం విశేషం. జగిత్యాల పట్టణంలో జరిగిన ఈ విషాద ఘటన.. కలకలం రేపింది. పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన ఎక్కల్‌దేవి మల్లిక (19), ఎక్కల్‌దేవి గంగాజల (19), ఎక్కల్‌దేవి వందన (16) అనే ముగ్గురు యువతులు సమీప బంధువులు.
అంతకుమించి ప్రాణ స్నేహితులు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురు యువతులూ వారి వారి ఇళ్ల నుంచి ఒకేసారి బయలుదేరారు. లేడీస్ ఎంపోరియంకు వెళుతున్నామని చెప్పారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో.. గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పట్టణంలోని ధర్మసముద్రం చెరువులో ఆ ముగ్గురు యువతుల మృతదేహాలను గుర్తించారు. ఈ ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే.. ముగ్గురూ ఒకేసారి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం అంతుబట్టలేదు.
ఆత్మహత్యల వెనుక కారణాలివేనా!
ఆత్మహత్యకు పాల్పడ్డ ముగ్గురు యువతుల్లో ఇద్దరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. మరో యువతి ఇంటర్ చదువుతోంది. మల్లికకు ఆగస్టు 20న కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడితో వివాహం జరిగింది. కానీ, రెండు నెలలు తిరక్కుండానేఆమె అమ్మగారింటికి వచ్చేసింది. గంగాజలకు గత ఆగస్టు 23న జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాజుతో వివాహం జరిగింది. ఆమె కూడా కొద్ది రోజుల్లోనే అత్తవారింట గొడవపడి పుట్టింటికి చేరింది. ఇక మూడో యువతి వందన.. జగిత్యాల పట్టణంలో ఇంటర్ చదువుతోంది. ఆమె తల్లి ఆరేళ్ల క్రితం మృతి చెందడంతో.. తండ్రి, సోదరులతో కలిసి ఉంటోంది. ఇలా.. ఈ ముగ్గురి జీవితాల్లోనూ విషాద ఛాయలు ఉన్నాయి. ఈ ముగ్గురూ తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకుని ఉంటారని, దీంతో.. తీవ్రమైన మనోవేదనకు గురై కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, వారి కుటుంబసభ్యులు మాత్రం ముగ్గురూ అనారోగ్యంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఎందుకు చెబుతున్నారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. యువతుల సెల్‌ఫోన్లను, కాల్‌డేటాను పరిశీలిస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు.