బతుకుదెరువుకు బాసట
ABN , First Publish Date - 2021-08-07T05:55:29+05:30 IST
బతుకుదెరువుకు బాసట
సెలూన్లు, లాండ్రీషాపులకు ఉచిత విద్యుత్
ప్రతీ నెల 250 యూనిట్లు
ఇప్పటివరకు 1,329 దరఖాస్తులు దాఖలు
కేటగిరి–1 మీటర్లు ఉచితంగా మార్పు
పథకం అందరికీ అందేలా విస్తృత ప్రచారం
హన్మకొండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సెలూన్లు, లాండ్రీ షాపులు, దోబీ ఘాట్‌లకు ప్రతీనెల 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఉచిత విద్యుత్ కోసం వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు, సెలూన్లు, లాండ్రీ షాపుల నిర్వాహకుల నుంచి మొత్తం 1,329 దరఖాస్తులు అందాయి. వీటిలో సెలూన్లు నడుపుకుంటున్న నాయీబ్రాహ్మణుల నుంచి 762, లాండ్రీ షాపులు నిర్వహిస్తున్న రజకుల నుంచి 567 దరఖాస్తులు వచ్చాయి. అర్బన్ జిల్లాలో 11 దోబీఘాట్లు మంజూరు కాగా, ప్రస్తుతం రెండే నడుస్తున్నాయి. వీటి నుంచి కూడా దరఖాస్తులు దాఖలయ్యాయి.
ఎప్పుడైనా దరఖాస్తు
2021–22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, జూన్ 1 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం జూన్ 30 కటాఫ్ తేదీగా పెట్టినప్పటికీ, ఎప్పుడైనా దరఖాస్తులను దాఖలు చేయవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే జూన్ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకున్నవారికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కరెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకున్నవారికి వారు దరఖాస్తులు సమర్పించిన నెల నుంచి మాత్రమే కరెంట్ బిల్లు మాఫీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
నాయీబ్రాహ్మణులు, రజకవృత్తిదారులు తమ దరఖాస్తులను హెచ్‌టిటీపీఎ్‌స://టీఎ్‌సవోబిఎంఎం్‌స.సీజీజీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు కావల్సిన పత్రాలు ఆధార్‌కార్డు వివరాలు, ఫోన్ నెంబర్, కుల ధ్రువీకరణ పత్రాలు, చిరునామా, విద్యుత్ కమర్షియల్ సంఖ్య, అద్దె గదిలో వ్యాపారం నిర్వహిస్తే రెంటల్ అగ్రిమెంట్, లబ్ధిదారుడి ఫొటో, విద్యుత్ బిల్లు, లాండ్రీ లేదా హెయిర్ సెలూన్ ఫొటో, లేబర్ లైనెస్సు లేదా ట్రేడ్ లైసెన్స్ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
యూఎ్‌ససీ తప్పనిసరి
దరఖాస్తుచేసే సమయంలో విద్యుత్ బిల్లుపై ఉన్న యూనిక్ సర్వీస్ కోడ్ (యూఎ్‌ససీ) నమోదు చేయా లి. ఈ విషయం తెలియక చాలా మంది.. బిల్లులో ఉన్న సర్వీస్ నెంబర్‌ను నమోదు చేస్తున్నారు. దీనివల్ల పథకానికి అనర్హులయ్యే అవకాశముందని భావించిన ప్రభుత్వం.. ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారు మీ సేవా కేంద్రానికి వెళ్లి యూఎ్‌ససీ నెంబర్‌ను చేర్చాలని అధికారులు సూచిస్తున్నారు. స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారే ఆయా దరఖాస్తులను యూఎ్‌ససీ నెంబర్‌ను నమోదు చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి రజక, నాయీబ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు విద్యుత్ బిల్లులను వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆయా జిల్లాల ట్రాన్స్‌కో ఎస్‌ఈలకు ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్నవారి ఈ మూడు నెలల సెలూన్, లాండ్రీల కరెంట్ బిల్లులు కూడా వారి పేర ప్రభుత్వం అప్పుడే చెల్లించేసింది.
మీటర్ల మార్పు
పలువురు దరఖాస్తుదారులు కేటగిరి–1 (గృహ) విద్యుత్ బిల్లులను జతపరుస్తున్నారు. వారి దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.. తిరిగి వీటిని కొత్తమీటర్ల కింద పరిగణించి ఉచితంగానే మీటర్లను అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరందరికీ కేటగిరి–2 కింది కనెక్షన్లుగా పరిగణించి మీటర్లు ఇవ్వనున్నారు. సెలూన్లకు సంబంధించి 762 మంది దరఖాస్తుల్లో 576 మందివి పాత మీటర్లు కాగా, 186 మందివి కొత్తమీటర్లు. అలాగే లాండ్రీలకు సంబంధించి మీటర్లలో పాతవి 194 కాగా, కొత్తవి 373. అద్దె గదుల్లో సెలూన్లు, లాండ్రీలు నడుపుకుంటున్నవారిలో కొందరు మీటర్లు మారిస్తే ఇంటి యజమాని ఎక్కడ ఒప్పుకోడో అని దరఖాస్తులు పెట్టుకోవడం లేదు. అటువంటి వారిని అధికారులు గుర్తించి వారికి అవగాహన కల్పించడం ద్వారా దరఖాస్తులు చేసుకునేలా చూస్తున్నారు. కాగా, బయట అద్దె గదుల్లో లాండ్రీలు నడుపుకునేవారి సంగతి సరే.. మరి అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్లుగా ఉంటూ మరోపక్క అదనపు ఆదాయం కోసం ఆ పార్ట్‌మెంట్‌వాసులవే కాకుండా బయటివారి బట్టలను ఇస్త్రీ చేసేవారి పరిస్థితి ఏమిటీ? తమకు కూడా ఉచిత కరెంట్ పథకం వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. ఇటువంటి వారు నగరంలో 500 నుంచి 600 మంది వరకు ఉంటారు. తమను కూడా ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.