ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం

ABN , First Publish Date - 2021-08-25T07:40:24+05:30 IST

తెలంగాణలోని పలు జలాశయాల్లో ఏటా పూడిక పేరుకుపోతోంది.

ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం

  • 9 రిజర్వాయర్లలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వేకు
  • టెండర్లు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పలు జలాశయాల్లో ఏటా పూడిక పేరుకుపోతోంది. వర్షాకాలంలో నదులకు వరదలు వచ్చిన సమయంలో ప్రవాహంలో మట్టి, రాళ్లు, చెత్త కొట్టుకువచ్చి ప్రాజెక్టుల్లో మేట వేస్తున్నాయి. దీంతో రిజర్వాయర్లలో ఆశించిన మేర జలాలు నిల్వ ఉండటం లేదు. ఏటా జలాశయాల నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించింది. అసలు పూడిక పేరుకుపోవడానికి కారణాలేంటి..? నష్ట నివారణకు ఏయే చర్యలు తీసుకోవాలి..? రిజర్వాయర్ల సామర్థ్యం ఎంత..? ఏ మేర నిల్వలు తగ్గాయి..? తదితర అంశాలను తెలుసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఇందుకోసం అధికారులు రాష్ట్రంలోని 9 రిజర్వాయర్లలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వేకు టెండర్లు పిలిచారు. జూరాల(గద్వాల జిల్లా), సింగూరు(సంగారెడ్డి), లోయర్‌ మానేరు(గంభీరావుపేట, కరీంనగర్‌), కుమ్రం భీం ప్రాజెక్టు(ఆసిఫాబాద్‌), ర్యాలీవాగు ప్రాజెక్టు(మంచిర్యాల), మత్తడివాగు ప్రాజెక్టు(థాంసి, ఆదిలాబాద్‌), సుద్దవాగు ప్రాజెక్టు(గడ్డెన్నవాగు-నిర్మల్‌), రామడుగు(దర్పల్లి, నిజామాబాద్‌), ఎన్టీఆర్‌ సాగర్‌(చెలిమలవాగు-ఆదిలాబాద్‌) ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం చేపట్టనున్నారు. దీని కోసం జాతీయ స్థాయిలో బిడ్లను ఆహ్వానించారు.


సెప్టెంబరు 15 సాయంత్రం 3 గంటల్లోగా టెండర్ల దాఖలుకు గడువు విధించారు. అదే రోజు 3:30 గంటలకు సాంకేతిక బిడ్లను పరిశీలించనున్నారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఏడాదిలోపు నివేదిక అందించాలి. వాస్తవానికి ప్రతి పదేళ్లకు తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబోరేటరీ(టీఎ్‌సఈఆర్‌ఎల్‌) ఆధ్వర్యంలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వే చేపడుతున్నారు. త్వరలోనే మిగిలిన ప్రాజెక్టుల్లో ఈ సర్వేకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలున్నాయి. చివరిగా 2011లో సర్వే జరగ్గా.. తాజాగా మళ్లీ చేపట్టనున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌(చెరువుల) నుంచి పూడికను పొలాలకు తరలించే అవకాశాలున్నప్పటికీ.. మీడియం, మేజర్‌ ప్రాజెక్టుల్లో పూడికతీతకు అవకాశాల్లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వరద వచ్చే ప్రాంతాల్లో చిన్నాచితక బండ్లు, చెక్‌డ్యామ్‌లు వంటివి నిర్మించడం ద్వారా ప్రధాన ప్రాజెక్టుల్లో కొంతమేర పూడికను తగ్గించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.



Updated Date - 2021-08-25T07:40:24+05:30 IST