సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2021-10-20T08:34:57+05:30 IST

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఐఏఎన్‌ఎస్ (ఇండో-ఏసియన్‌ న్యూస్‌ సర్వీస్‌), సీ-ఓటర్‌ సర్వే వెల్లడించింది.

సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత

ప్రజాగ్రహంలో టాప్‌-1 సీఎం ఆయనే.. దేశంలోనే ఏపీ ఎమ్మెల్యేలపై అత్యంత వ్యతిరేకత

30.3% మంది ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు.. ఏపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

మూడో స్థానంలో తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఐఏఎన్‌ఎస్‌, సీ-ఓటర్‌ పరిపాలన సూచీ సర్వేలో వెల్లడి


న్యూఢిల్లీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ  ఆవిర్భావం తర్వాత వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని ఐఏఎన్‌ఎస్ (ఇండో-ఏసియన్‌ న్యూస్‌ సర్వీస్‌), సీ-ఓటర్‌ సర్వే వెల్లడించింది. అన్ని రాష్ట్రాల సీఎంలలో.. ప్రజాగ్రహం అధికంగా ఉన్న సీఎం ఆయనేనని ‘పరిపాలన సూచీ’ పేరిట తాజా సర్వేలో తేలిందని ఆ రెండు సంస్థలు ప్రకటించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 30.3%  మంది కేసీఆర్‌ను వ్యతిరేకించినట్లు పేర్కొన్నాయి. తర్వాత యూపీ సీఎం యోగి (28.1%), గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(27.7%) ఉన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేశ్‌ సింగ్‌ బఘేల్‌పై 6% మాత్రమే ప్రజాగ్రహం ఉంది. ఈ జాబితాలో కింది నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి(10.1%), ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌(10.4%) ఉన్నారు. సిటింగ్‌ ఎమ్మెల్యేల విషయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ‘‘సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఎంత మేర ఆగ్రహంగా ఉన్నారు..?’’ అన్న ప్రశ్నకు ఏపీ ఎమ్మెల్యేలపై అత్యధికంగా 28.5% మంది వ్యతిరేకతను తెలిపారు. ఆ తర్వాతి స్థానంలో గోవా ఎమ్మెల్యేలు(24.3%), తెలంగాణ ఎమ్మెల్యేలు(23.5%) ఉన్నారు. కేరళ ఎమ్మెల్యేలు 6.8 శాతంతో ఈ జాబితాలో చివరి స్థానంలో ఉండగా.. కింది నుంచి రెండు, మూడు స్థానాలను గుజరాత్‌ ఎమ్మెల్యేలు(7.4%), మహారాష్ట్ర ఎమ్మెల్యేలు(7.9%) దక్కించుకున్నారు.


సీఎంగా కేటీఆర్‌ను ప్రకటిస్తే..

సర్వే ఫలితాలపై సీ-ఓటర్‌ వ్యవస్థాపకుడు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఎక్కువ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో.. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు మంచి రేటింగ్‌ ఉన్న నేపథ్యంలో.. బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇదే మంచి సమయమని, లేదంటే పరిస్థితి చేయిదాటి పోతుందని అభిప్రాయపడ్డారు. సీఈవో తరహాలో పనిచేసే సీఎంలకు ప్రజాదరణ ఉంటోందని, కేంద్రీకృత నిర్ణయాలు తీసుకునే వారిని ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిపారు.  

Updated Date - 2021-10-20T08:34:57+05:30 IST