వస్త్రాలపై 12% జీఎస్టీ పెంపు అమలును ఆపండి

ABN , First Publish Date - 2021-12-31T08:01:20+05:30 IST

వస్త్రాలపై జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తున్నట్లు అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

వస్త్రాలపై 12% జీఎస్టీ పెంపు అమలును ఆపండి

  • పలు రాష్ట్రాల డిమాండ్‌.. దేశవ్యాప్తంగా నేత కార్మికులు, వస్త్ర వ్యాపారుల ఆందోళనలు
  • సూరత్‌లో దుకాణాల బంద్‌.. నేటి జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో చర్చ


న్యూఢిల్లీ, డిసెంబరు 30: వస్త్రాలపై జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తున్నట్లు అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. టెక్స్‌టైల్స్‌పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది వస్త్ర రంగమేనని.. అలాంటి రంగంపై జీఎస్టీ పెంపు సరికాదని నేత కార్మికులు, వ్యాపారులు చెబుతున్నారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ చాలా ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 46వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. అయితే గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలు వస్త్రాలపై జీఎస్టీ పెంపునకు తాము వ్యతిరేకమని ఇప్పటికే ప్రకటించాయి. 1 నుంచి జీఎస్టీ పెంపు అమలును ఆపాలని గుజరాత్‌ కోరింది. ఇదే విషయమై వ్యాపార వర్గాలు కూడా వినతి పత్రాలు సమర్పించాయి. వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12శాతానికి పెంచడం సరికాదని, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు. సాధారణ ప్రజలు రూ.1000 పెట్టి దుస్తులు కొంటే.. రూ.120 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలన్న అంశాన్ని గుజరాత్‌ రాష్ట్రం జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశ అజెండాలో చేర్చిందని, ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని సమర్థిస్తున్నాయని తమిళనాడు ఆర్థిక మంత్రి పి.త్యాగరాజన్‌ గురువారం చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


సూరత్‌లో వస్త్ర దుకాణాల బంద్‌ 

వస్త్రాలపై జీఎస్టీని 12 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ గుజరాత్‌లోని సూరత్‌లో వస్త్ర వ్యాపారులు, నేత కార్మికులు గురువారం బంద్‌ పాటించారు. వస్త్ర దుకాణాలు, మరమగ్గాల యూనిట్లను మూసివేశారు. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు పళ్లేలను మోగిస్తూ నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వస్త్ర వ్యాపారులు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పకోడీలు వేస్తూ, కూరగాయలు అమ్ముతూ నిరసన తెలిపారు.  


రాష్ట్రంలో 56 వేల కుటుంబాలకు ముప్పు

హైదరాబాద్‌/దుబ్బాక : వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ గుదిబండగా మారనుంది. ఇప్పటికే 5 శాతం జీఎస్టీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని 12 శాతానికి పెంచడంతో నేత కార్మికుల పరిస్థితి ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ’ చందంగా మారింది. 12 శాతం జీఎస్టీ అమల్లోకి వస్తే తెలంగాణలోని 56 వేల కుటుంబాలు ఉపాధిని కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉంది. జీఎస్టీ పెంపుతో చిన్నస్థాయి చేనేత పరిశ్రమలన్నీ మూతపడి వేలాది మంది కార్మికులు వీధిన పడే పరిస్థితి వస్తుందని, ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి చర్యలకు దిగితే ఎలాగని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలు దేశవ్యాప్తంగా 31.5 లక్షలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 1.60 లక్షలు ఉన్నాయి. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రకటించిన పథకాలను సైతం కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ వస్తోందని నేతన్నలు వాపోతున్నారు. జీఎస్టీ పెంపును నిరసిస్తూ.. అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 5 నుంచి దేశవ్యాప్తంగా ధర్నా, నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. తొలిరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. చేనేత వస్ర్తాలపై 12 శాతం జీఎస్టీని రద్దు చేయాలని అఖిల ఆ సంఘం చైర్మన్‌ వెంకన్న డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-31T08:01:20+05:30 IST