బొగ్గు గనుల వేలాన్ని ఆపండి
ABN , First Publish Date - 2021-12-09T06:50:39+05:30 IST
తెలంగాణలో తలపెట్టిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని

- తెలంగాణలోని 4 బ్లాకులు సింగరేణికి కీలకం
- వాటిని వేలమేస్తే బొగ్గు సరఫరాపై తీవ్ర ప్రభావం
- ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
- సింగరేణిలో నేటి నుంచే కార్మిక సంఘాల సమ్మె
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తలపెట్టిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ప్రధానికి లేఖ రాశారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు గురువా రం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ బుధవారం సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావుతో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. సమ్మె అంశంపై చర్చించారు. కోల్‌బెల్ట్‌లోని నాలుగు గనులను ఈ నెల 13న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేయాలని నిర్ణయించిందని అధికారులు చెప్పగా.. వేలాన్ని ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. సమావేశం అనంతరం ప్రధానికి లేఖ రాశారు. ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ విద్యుత్కేంద్రాల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తుందని సీఎం లేఖ లో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు చేరిందన్నారు. దీంతో విద్యుదుత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాల్సి వస్తోందని గుర్తుచేశారు. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందని, దానికి కేంద్ర బొగ్గు శాఖ కూడా ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కేంద్రం ట్రెంచ్-13 కింద వేలం వేయదలచిన సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి బ్లాక్ (శ్రీరాంపూర్, మందమర్రి), కోయగూడెం బ్లాక్-3 (ఇల్లెందు) ఓపెన్‌కా్‌స్ట బ్లాకులు, కల్యాణఖని బ్లాక్-6 (మందమర్రి) వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటి వేలాన్ని నిలిపివేయమని కేంద్ర బొగ్గు శాఖను ఆదేశించాలంటూ కేసీఆర్ ప్రధానిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నేటి నుంచి సమ్మె
బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణిలో గురువారం నుంచి 3 రోజు ల పాటు సమ్మె జరగనుంది. జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, సీఐటీయూ, బీఎంఎ్‌సతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ అనుబంధ సంస్థలైన బీఎంఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా సమ్మెలో పాల్గొంటుండడం విశేషం.
కాగా, తెలంగాణలో 7572 మెగావాట్ల సామర్థ్యం గల 7 థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. అందులో 810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భద్రాద్రి ప్లాంట్‌లో 12 రోజులకు సరిపడా, 1100 మెగావాట్ల కేటీపీపీలో 41 రోజులకు సరిపడా, కొత్తగూడెంలోని 1000 మెగావాట్ల కేటీపీఎ్‌సలో 8 రోజులకు సరిపడా, 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడో దశలో 23 రోజులకు సరిపడా, రామగుండంలోని ఎన్‌టీపీసీకి చెందిన 2600 మెగావాట్ల ప్లాంట్‌లో 9 రోజులకు, మరో 62 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం ప్లాంట్‌లో 8 రోజులు, సింగరేణికి చెందిన 1200 మెగావాట్ల ప్లాంట్ లో 11 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.

బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకం: సీఎంవోఏఐ
సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంవోఏఐ) సింగరేణి విభాగం ప్రకటించింది. 4 బ్లాకుల అన్వేషణకు సింగరేణి రూ.కోట్లు వెచ్చించిందని, ఇప్పుడా బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా వేలం వేయాలనే నిర్ణయం తగదని ఆ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేశ్, ఎస్.వి.రాజశేఖర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.