సరిహద్దుల్లో స్టాప్
ABN , First Publish Date - 2021-05-24T09:09:50+05:30 IST
తెలంగాణ-ఏపీ సరిహద్దుల వద్ద మళ్లీ గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా తెలంగాణ పోలీసులు ఏపీ సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు.

- గరికపాడు వద్ద మళ్లీ గందరగోళం
- ఏపీ నుంచి వచ్చే వాహనాల నిలిపివేత
- అంబులెన్స్‌లకు, పాస్ ఉన్నవారికి ఓకే
- పూర్తిగా నిలిచిపోయిన ఈ-పాస్ సేవలు
కోదాడ/కోదాడ రూరల్/కల్లూరు/హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-ఏపీ సరిహద్దుల వద్ద మళ్లీ గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా తెలంగాణ పోలీసులు ఏపీ సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఈ-పాస్ లేకుండా ఏపీ నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పంపారు. ఇది వాహనదారులు, పోలీసుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం సరిహద్దు వద్ద వందల సంఖ్యలో వాహనాలను పోలీసులు నిలిపివేయడంతో ప్రయాణికులు గంటల కొద్దీ రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 6నుంచి 10గంటలకు వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌కు మినహాయింపు ఉండడంతో ఆ సమయంలో వెళ్లవచ్చుననే అంచనాతో ఏపీలోని సుదూర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు అర్ధరాత్రే బయలుదేరారు. ఉదయం 5గంటల వరకు సరిహద్దుకు చేరుకున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నుంచి లాక్‌డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని శనివారం ప్రకటించింది. ఈ మేరకు రామాపురంతోపాటు, దొండపాడు, పులిచింతల, మఠంపల్లి చెక్‌పోస్టుల వద్ద ఈ-పా్‌సలేని వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దామరచర్ల మండలంలోని వాడపల్లి, నాగార్జునసాగర్ సరిహద్దుల వద్ద కూడా ఆంక్షలను కఠినంగా అమలు చేశారు. దీంతో కొందరు వాహనదారులు అప్పటికప్పుడు సెల్‌ఫోన్లలో ఈ-పాస్ నమోదుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక హైదరాబాద్‌లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కోసం అంబులెన్సులు, వాహనాల్లో వెళుతున్న వారిని మాత్రం అనుమతించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఏపీ-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ప్రధాన రహదారులపై చెక్‌పోస్టుల ఏర్పాటుతోపాటు ఆదివారం డొంక రహదారులను కూడా మూసివేశారు.
ఈ-పాస్ సేవలు బంద్!
లాక్‌డౌన్‌లో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చే ఈ-పాస్ సేవలు ఆదివారం పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక పోర్టల్‌లోని ‘లాక్‌డౌన్ ఈ-పాస్’ డ్యాష్‌బోర్డు ద్వారా ఈ అనుమతులిస్తున్నారు. దరఖాస్తుదారుల కారణాలను పరిశీలించి పాస్‌లను పోలీసులు మంజూరు చేస్తున్నారు. పోలీస్ కమిషనరేట్లు, ఎస్సీ కార్యాయాల్లోని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పాస్‌ల మంజూరు బాధ్యతను అప్పగించారు. అయితే శనివారం అర్ధరాత్రి నుంచే తెలంగాణ పోలీస్శాఖ పోర్టల్ పనిచేయడం లేదు. ఈ సమస్యను కొందరు ట్విటర్ ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ‘తెలంగాణ పోలీస్శఖ పోర్టల్‌ను ఆధునికీకరిస్తున్నాం. ఈ-పాస్ దరఖాస్తులను సులభతరం చేసేలా కొత్త ఫీచర్లను అప్‌డేట్ చేస్తున్నాం. పోర్టల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది’’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి బదులిచ్చారు.