అన్నదాతల ఆందోళన
ABN , First Publish Date - 2021-05-22T04:53:30+05:30 IST
అన్నదాతల ఆందోళన

ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని మండిపాటు
ఇల్లందలో రాస్తారోకో.. రైతుల గోడు విన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్
వర్ధన్నపేట, మే 21 : ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదంటూ అన్నదాతలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఇల్లంద మార్కెట్ యార్డులో ధాన్యం కాంటాలు నిలిచిపోవడంతో రైతులు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వరంగల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తన వాహనంలో వరంగల్‌కు వెళ్తుండగా రాస్తారోకోలో నిలిచిపోయారు. రైతుల ఆందోళన ఎక్కువ కావడంతో ట్రాఫిక్ జామ్‌తో ఎమ్మెల్యే రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు విన్నారు. వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు ఫోన్ చేసి రైతుల సమస్యలను తీర్చాలని, కాంటాలు అయ్యేలా చూడాలని కోరారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో ఆందోళన విరమింపజేశారు. కాగా, ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఆర్డీవో మహేందర్ జీ అక్కడికి వచ్చి విచారణ చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుకున్న వాటికంటే ధాన్యం భారీ స్థాయిలో కేంద్రాలకు వస్తున్నదన్నారు. మిల్లర్ల సామర్థ్యం ఇప్పటికే పూర్తయిందని, రైతుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కాంటాలు వేసి లోడుతో వెళ్లిన వాహనాలే ఇప్పటికీ దిగుమతి కావడం లేదని, దీంతో వాహనాల సమస్య సైతం ఏర్పడిందన్నారు. ఎస్సై వంశీకృష్ణ సహకారంతో ఇతర వాహనాలను ఆపి మానవతా దృక్పథంతో రైతుల కోసం కాంటాల వద్దకు తెస్తున్నామన్నారు.
లారీలు పంపించాలని నిరసన
చెన్నారావుపేట: పాపయ్యపేటలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని శుక్రవారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే 2వేల బస్తాలను కాంటాలు చేసి ఉన్నాయన్నారు. వారం రోజులుగా లారీలు రాక పోవటంతో ఎగుమతి కావడం లేదన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించాలని రైతులు కోరుతున్నారు. ఒక్కో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వారం, పది రోజులుగా పడిగాపులు కాస్తున్నామన్నారు. కార్యక్రమంలో భూక్య రాజు, లావుడ్య ఈర్య, భూక్య నర్సింహా, అన్న కమలయ్య, ఈర్య, హనుమా, భూక్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే తిమ్మారాయిన్‌పహాడ్ సెంటర్‌లో రైతులే రవాణా చార్జీలకు భరించుకుంటూ ట్రాక్టర్‌లు డీసీఎంల ద్వారా మిల్లులకు ధాన్యంను తరలిస్తున్నారు.