ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ.. ఈజీ మనీ కోసం..

ABN , First Publish Date - 2021-08-20T17:40:54+05:30 IST

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌..

ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ.. ఈజీ మనీ కోసం..

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు


వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు దొంగలను సీసీఎస్‌, ఎల్కతుర్తి, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.2.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఒక ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌ కార్యాలయంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప గురువారం నిందితుల అరెస్టును చూపించి వివరాలను వెల్లడించారు. 


పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్లపల్లి గ్రామానికి చెందిన బోగిరి సాయితేజ, జునగిరి రవివర్మ ఇద్దరూ భీమదేవవరపల్లిలో చోరీకి పాల్పడ్డారు. అలాగే జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామారం గ్రామానికి చెందిన మాసంపెల్లి కామరాజు మరో చోరీ ఘటనలో నిందితుడు. సాయితేజ, రవివర్మ మద్యానికి, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని స్కెచ్‌ వేశారు. భీమదేవరపల్లికి చెందిన సాయితేజ తన మేనత్త మొక్కులు చెల్లించుకునేందుకు వేములవాడకు వెళ్తున్నట్లు తెలుసుకున్నాడు. తన తండ్రి ద్విచక్రవాహనం తీసుకుని రవివర్మతో కలిసి ఈనెల 7న మేనత్త ఇంటికి వెళ్లాడు. రాత్రి ఇంటి వెనక తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.


బీరువాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.6వేల నగదును ఎత్తుకెళ్లారు. వీరిద్దరూ గతంలో మైనర్లుగా ఉన్నప్పుడు కూడా దొంగతనాలకు పాల్పడడంతో పోలీసులు పట్టుకుని బాలుర పరిశీలక గృహానికి తరలించారు. బెయిల్‌పై వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడ్డారు. కాగా సాయితేజ, రవివర్మ గురువారం ముల్కనూరుకు వస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.  వీరి నుంచి 27.5 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, ఒక ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 


మరో ఘటనలో కామరాజు హనుమకొండలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవాడు. ఈనెల 4న హనుమకొండ నయీంనగర్‌లో ఓ సెల్‌ఫోన్‌ షాపునకు వెళ్లి సెల్‌చార్జింగ్‌ పెట్టుకుంటానని షాపు యజమానిని నమ్మించాడు. అదును చూసి షాపులో ఉన్న సుమారు రూ.60వేల విలువై న సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. బాధితుడు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు కామరాజుగా గుర్తించా రు. గురువారం  అతడు హనుమకొండ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  చోరీ చేసిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో క్రైం ఏసీపీ బాబురావు, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ ఎల్‌.రమే్‌షకుమార్‌, ఎల్కతుర్తి సీఐ ఎస్‌.శ్రీనివాస్‌, ఏవో సల్మాన్‌ పాషా, భీమదేవరపల్లి ఎస్సై చంద్రమోహన్‌, హనుమకొండ ఎస్సై రఘుపతి, సీసీఎస్‌ ఎస్సై రాజేందర్‌, ఏఎస్సైలు శివకుమార్‌, సుధాకర్‌, హెడ్‌కానిస్టేబుళ్లు జంపయ్య. అలీ, హమ్మద్‌పాషా, కానిస్టేబుళ్లు వంశీ, సురేష్‌, సుధాకర్‌, నజీర్‌ పాల్గొన్నారు.Updated Date - 2021-08-20T17:40:54+05:30 IST