వేగ నియంత్రణతోనే ప్రమాదాల నివారణ

ABN , First Publish Date - 2021-01-20T08:23:25+05:30 IST

మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతుందని, అందుకే వేగ నియంత్రణతో ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

వేగ నియంత్రణతోనే ప్రమాదాల నివారణ

రోడ్డు భద్రత నిత్య జీవనంలో భాగం కావాలి : పువ్వాడ


హైదరాబాద్‌, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణమవుతుందని, అందుకే వేగ నియంత్రణతో ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రోడ్డు భద్రత అంశం నిత్య జీవనంలో ఓ భాగం కావాలని ఆకాంక్షించారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. రహదారి భద్రతకు సంబంధించిన బ్యానర్లు, స్టిక్కర్లు, రోడ్డు నిబంధనల కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తోందని పువ్వాడ చెప్పారు. 


సిరిసిల్లలో త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్‌ స్కూలును ప్రారంభిస్తామని వెల్లడించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి చేపట్టిన బైక్‌ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాగా, తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ అసోసియేషన్‌ డైరీ-2021, వాల్‌ క్యాలెండర్‌, టేబుల్‌ క్యాలెండర్‌లను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.  

Updated Date - 2021-01-20T08:23:25+05:30 IST