‘బుల్లెట్‌ బండి’ పాటకు స్టాఫ్‌ నర్సు డ్యాన్స్‌

ABN , First Publish Date - 2021-08-22T08:55:07+05:30 IST

‘బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తపా’ అన్న జానపద గీతం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘బుల్లెట్‌ బండి’ పాటకు స్టాఫ్‌ నర్సు డ్యాన్స్‌

నెట్టింట వైరల్‌, చర్యలకు అధికారుల ఆదేశం

సిరిసిల్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘బుల్లెట్‌ బండెక్కి వచ్చేస్తపా’ అన్న జానపద గీతం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంచిర్యాల జిల్లాలో సాయి శ్రేయ అనే నవవధువు ఈ పాటకు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చాలామంది మహిళలు ఈ పాటకు నృత్యం చేస్తూ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా చేస్తున్న రజని అనే ఆమె కూడా ఆ పాటకు డ్యాన్స్‌ చేసింది. పంద్రాగస్టు వేడుకల నాడు ప్రభుత్వాసుపత్రిలో ఆమె చేసిన నృత్యాన్ని, ఆమె స్నేహితులు షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అయి అధికారుల వరకూ చేరింది. దీంతో.. నర్సు సరదాకి చేసిన నృత్యం కాస్తా.. ఆమె కొలువుకే ఎసరు పెట్టింది. ఆ వీడియోపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రజనికి మెమో జారీ చేశారు. అందుకు సంబంధించిన నివేదికను వారు కలెక్టర్‌కు అందించినట్లు సమాచారం.

Updated Date - 2021-08-22T08:55:07+05:30 IST