ఎస్సారెస్పీ పరిధిలో రెడ్‌ అలర్ట్‌

ABN , First Publish Date - 2021-07-24T07:51:27+05:30 IST

తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు! పోటెత్తుతున్న వరద! లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి

ఎస్సారెస్పీ పరిధిలో రెడ్‌ అలర్ట్‌

నిర్మల్‌ జిల్లాలో కూడా.. ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌

ఆకస్మిక వరదలతో జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద పోటు

వచ్చిన దానికంటే ఎక్కువగా దిగువకు

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు! పోటెత్తుతున్న వరద! లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. అంతేనా, ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు (ఫ్లాష్‌ ఫ్లడ్స్‌) వచ్చే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. దాంతో, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నిర్మల్‌ జిల్లా రెడ్‌ అలర్ట్‌ పరిధిలో ఉండగా.. ఆదిలాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇక, తుంగభద్ర, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లోకి కూడా ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో అరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. సాధారణంగా రిజర్వాయర్లు నిండుకుండలుగా మారినప్పుడు మాత్రమే వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తుంటారు.


రిజర్వాయర్లు ఇంకా పూర్తిగా నిండకుండానే కృష్ణా నదికి ఎగువ భాగంలో ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లలోకి వచ్చిన వరద కంటే ఎక్కువగా నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం.. ఆలమట్టిలోకి 1,22,778 క్యూసెక్కుల వరద వస్తోంది. కానీ, ఇక్కడి నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. అలాగే, నారాయణపూర్‌కు 2,38,000 క్యూసెక్కులు వస్తుండగా.. 3 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇందుకు కారణం.. ఆకస్మిక వరదలు వస్తాయన్న హెచ్చరిక. వాటి నుంచి రిజర్వాయర్లను కాపాడుకోవాలన్న ముందుచూపు. అలాగే, జూరాల ప్రాజెక్టులోకి 1,66,400 క్యూసెక్కుల నీరు వస్తోంది. అక్కడి నుంచి 1,93,911 క్యూసెక్కులను వదిలేశారు. గోదావరి బేసిన్‌లోనూ ఇదే పరిస్థితి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2.06 లక్షల క్యూసెక్కులను, ఎల్లంపల్లికి 4.03 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు.లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం: ఎస్పీడీసీఎల్‌

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీరు చేరిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సరఫరా పునరుద్ధరణకు అన్ని సెక్షన్‌ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు (సీజీఎం), ఎస్‌ఈలతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి సర్కిల్‌ పరిధిలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, వినియోగదారులు తమ సమస్యలను 1912/ 100తోపాటు ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ tssouthpower.com లేదా ఫేస్‌బుక్‌/ ట్విటర్‌ ద్వారా తెలపవచ్చని సూచించారు.


విద్యుత్తు వైర్లు తాకొద్దు.. 

కిందికి వంగిన, కూలిన విద్యుత్‌ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి. వాటిని తాకొద్దు. కింద పడ్డ/ వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను తాకడం, వాటిపై నుంచి వాహనాలు నడపరాదు.

చెట్లు, వాహనాలపై విద్యుత్‌ వైర్లు పడితే వాటికి దూరంగా ఉండాలి.

రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్‌ వైర్లు కానీ, ఇతర విద్యుత్‌ పరికరాలు మునిగితే ఆ నీటిలోకి వెళ్లవద్దు.

విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లకు పశువులను కట్టరాదు. వర్షం పడేటప్పుడు, తగ్గిన తర్వాత పశువులను వాటి నుంచి దూరంగా తీసుకెళ్లాలి.

వర్షం కురిసే సమయంలో విద్యుత్‌ లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడవద్దు. చెట్లు ఎక్కొద్దు.


చెరువులకు జలకళ

భారీ వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో 43,863 చెరువులు ఉన్నాయి. వాటిలో 4,698 చెరువులు అలుగులు దూకుతున్నాయి. మరో 12,990 చెరువుల్లో 25 శాతంలోపు నీళ్లు రాగా.. 10,132 చెరువులు సగం దాకా నిండాయి. ఇంకో 8,469 చెరువుల్లో 50-75 శాతం దాకా నీళ్లు రాగా.. 7,574 చెరువుల్లో 75-100% నిండాయి. ఆగస్టు 10 దాకా వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలోని చెరువులన్నీ నిండుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చెరువులు నిండి అలుగులు దూకుతుండటంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం చీఫ్‌ ఇంజనీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

Updated Date - 2021-07-24T07:51:27+05:30 IST