సర్కార్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2021-05-05T07:49:59+05:30 IST

ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్‌ భూము ల వ్యవహారంలో కేసీఆర్‌ సర్కారుకు చుక్కెదురైంది.

సర్కార్‌కు చుక్కెదురు

  • ఈటల హేచరీస్‌ భూముల వ్యవహారంలో కలెక్టర్‌ నివేదికపై స్టే
  • పిటిషనర్లపై దుందుడుకు చర్యలొద్దు
  • 120 ఎకరాలు ఒక్కరోజులో సర్వే చేశారా
  • నోటీసులివ్వకుండా సర్వే ఏమిటి?
  • ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
  • కారులో కూర్చొని నివేదిక ఇచ్చినట్లుంది
  • ప్రభుత్వం బోర్డులు పెడితే భూములు సొంతం అవుతాయా?
  • ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఏదైనా చేసేస్తారా? 
  • విచారణ రాజమార్గంలో చేయాలి
  • సర్కారుకు స్పష్టం చేసిన హైకోర్టు
  • తదుపరి విచారణ జూలై 6కి వాయిదా

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్‌ భూము ల వ్యవహారంలో కేసీఆర్‌ సర్కారుకు చుక్కెదురైంది. భూముల సర్వేపై అధికారుల  తీరును హై కోర్టు తప్పుపట్టింది. వారి చర్యలు సహజ న్యాయసూత్రాలకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. అధికారుల తీరు విశ్వనీయంగా లేదంది. ఇది కేవలం ప్రాథమిక విచారణేనని, పూర్తి విచారణను నిబంధనల ప్రకారం చేస్తామంటూ అఫిడవిట్‌ రూపంలో హామీ ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. మే 1న మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను నిలుపుదల చేసింది. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడమేంటని నిలదీసింది. జమున హేచరీస్‌ సంస్థపై, దాని డైరెక్టర్లపై ఎలాంటి దుందుడుకు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. 


మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లోని జమున హేచరీ్‌సకు చెందిన భూముల్లోకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా చొరబడి ఏకపక్షంగా సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ సంస్థ డైరెక్టర్లు నితిన్‌, జమున (ఈటల రాజేందర్‌ కుమారుడు, భార్య) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం హౌస్‌మోషన్‌లో విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ఏప్రిల్‌ 30న కొందరు తమ అసైన్డ్‌ భూములను ఈటల కుటుంబీకులు ఆక్రమించారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా.. దానిపై సీఎం విచారణకు ఆదేశించారని తెలిపారు. మే 1న ఉదయం 6 గంటలకే అధికారులు అక్కడకు చేరుకున్నారన్నారు. వారివెంట మీడియాను తీసుకెళ్లారని తెలిపారు. 24 గంటల్లోనే సమగ్ర సర్వే చేసి నివేదిక రూపొందించినట్లు పేర్కొన్నారని, ఏ నిబంధనల ప్రకారం ఈ సర్వే చేశారో చెప్పలేదని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో సున్నితంగా పెరుగుతున్న కోడిపిల్లలున్న ఆధునిక పౌలీ్ట్ర షెడ్లలోకి ప్రొటోకాల్‌ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు, పోలీసులు వాహనాలతో ప్రవేశించారని తెలిపారు. 


జమున హేచరీ్‌సకు అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో సుమారు 59 ఎకరాల భూమి ఉందని, అంతా పట్టా భూమేనని వివరించారు. భూములను ఆక్రమించినట్లు ఫిర్యాదులు వస్తే తహసీల్దారు సర్వే చేసి నిర్ధారించాలని.. ఇక్కడ జిల్లా కలెక్టరే అక్రమంగా పిటిషనర్ల భూముల్లోకి చొరబడి 24 గంటల్లోనే నివేదిక రూపొందించారని తెలిపారు. నివేదికలో ఈటల జమున భర్త నితిన్‌ అని రాశారని.. వాస్తవానికి జమున ఈటల రాజేందర్‌ భార్య అని, నితిన్‌ వారి కుమారుడని తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే పౌలీ్ట్ర ఏర్పాటు చేశారని చెప్పారు. కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక పూర్తిగా అవాస్తవాలతో ఉందని, దాన్ని కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి.. సర్వే చేయడానికి నోటీసులు ఎప్పుడు ఇచ్చారని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయవచ్చా? అని నిలదీశారు. ఏజీ బదులిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. 


మళ్లీ స్పందించిన న్యాయమూర్తి.. అధికారులు భూములపై సర్వేకు ఎన్ని గంటలకు వెళ్లారు? ఉదయాన్నే ముఖం కూడా కడుక్కోకుండా వెళ్లి సర్వే చేస్తారా? అని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. ఒక మంత్రిపై ఆరోపణలు రావడంతో చేయాల్సి వచ్చిందన్నారు. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. కల్పించుకున్న న్యాయమూర్తి ‘మీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలా?’ అన్నారు. ‘‘అధికారులు చేసింది సరికాదు. మీరు ప్రాథమిక నివేదిక అంటున్నారు. అధికారులు సమగ్ర నివేదిక అని రాశారు. నా భూమి 18 ఎకరాలు. దాన్ని సర్వే చేయడానికి రెండు రోజులు పట్టింది. 120 ఎకరాలను 24 గంటల్లోనే ఎలా పూర్తి చేశారు? దీన్నిబట్టి చూస్తే అధికారులు కారులో కూర్చునే నివేదిక తయారు చేసినట్లుగా ఉంది. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికపై స్టే ఆదేశాలిస్తాం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 


చార్మినార్‌, రాజ్‌భవన్‌కూ బోర్డు పెట్టుకోవచ్చా?

‘‘పూర్తి సర్వే చేయకుండా, భూములు గుర్తించకుండా బోర్డులు ఎలా ఏర్పాటు చేస్తారు? ఇలాగైతే ఎవరి భూముల్లోకైనా వెళ్లి ప్రభుత్వ భూములని బోర్డులు పెడితే సరిపోతుందా? చార్మినార్‌, రాజ్‌భవన్‌ తమవేనని ఎవరైనా బోర్డులు పెట్టుకుంటే సరా? ఒక పద్ధతి అక్కర్లేదా?’’ అని న్యాయమూర్తి ఏజీని నిలదీశారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేస్తామని, దానిపై అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఏజీ బదులిస్తూ.. పోటా లేదా మరేదైనా చట్టాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. తిరిగి కల్పించుకున్న న్యాయమూర్తి.. అధికారులు ఆర్టికల్‌ 14, 19, 21 కింద పౌరులకు లభించే ప్రాథమిక హక్కులు, ఆర్టికల్‌ 300ఏ కింద రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కులను ఉల్లంఘించారని ఎత్తిచూపారు. ‘‘చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే సర్వే చేయాల్సి ఉంటుంది’’ అని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కల్పించుకుంటూ.. ఈ కేసులో కౌంటర్‌ వేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ల ఆధీనంలో ఉన్న భూముల్లోకి చొరబడకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని, పిటిషనర్లపై ఎటువంటి దుందుడుకు చర్యలు తీసుకోరాదని, జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను నిలుపుదల చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్లలో కోరినట్లు మధ్యంతర ఆదేశాలు జారీచేశారు.  తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేశారు.


అనుమతులన్నీ ఉంటే అక్రమం ఎలా..?

‘‘షెడ్లలకు అనుమతులు ఉన్నాయి. విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. కాలుష్య నింత్రణ మండలి కూడా అనుమతి ఇచ్చింది. అన్నీ ఉన్నప్పుడు అక్రమంగా నిర్మిస్తున్నారని నివేదికలో ఎలా పేర్కొంటారు? అసలు నోటీసులు ఇవ్వకుండా అధికారులు తీసుకున్న చర్యలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది’’ అని న్యాయమూర్తి అభిప్రాయడ్డారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి కల్పించుకుంటూ.. నివేదికను పిటిషనర్లకు ఇంతవరకు ఇవ్వలేదని, ఈ కాపీని బయట సంపాదించామన్నారు. ఏజీ వివరణ ఇస్తూ.. తహసీల్దారు నివేదిక ఆధారంగానే కలెక్టర్‌ తనిఖీలు చేసి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. స్పందించిన న్యాయమూర్తి.. తహసీల్దారు ఎప్పుడు నివేదిక ఇచ్చారని ప్రశ్నించారు.

Updated Date - 2021-05-05T07:49:59+05:30 IST