వేగం, మత్తు.. ప్రాణాలు చిత్తు!

ABN , First Publish Date - 2021-12-19T06:58:00+05:30 IST

ఒకరేమో మితిమీరిన వేగంతో కారును నడిపారు. మరొకరేమో వేగంతో పాటు మద్యం మత్తులో కారును తోలారు.

వేగం, మత్తు.. ప్రాణాలు చిత్తు!

 • రాష్ట్రంలో నెత్తురోడిన రహదారులు.. 
 • వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం! 
 • కామారెడ్డి జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..
 •  12 మందిలో ఏడుగురి దుర్మరణం.. 
 • మృతుల్లో ముగ్గురు చిన్నారులు
 • తుడిచిపెట్టుకుపోయిన ఓ కుటుంబం.. 
 • మహారాష్ట్రలో దర్గా దర్శనానికి.. తిరుగు ప్రయాణంలో విషాదం
 • గచ్చిబౌలిలో చెట్టును ఢీకొన్న కారు.. రెండు ముక్కలు..
 •  జూనియర్‌ ఆర్టిస్‌లైన ఇద్దరు యువతులు సహా ముగ్గురి దుర్మరణం.. 
 • అద్దెకారులో స్నేహితుడి ఇంటికి.. 
 • రాత్రి మద్యం పార్టీ.. అర్ధరాత్రి దాటాక కారులో బయటకు.. 
 • మద్యం మత్తులో నడపడంతోనే ప్రమాదం


కామారెడ్డి, పెద్దకొడ్‌పగల్‌, హైదరాబాద్‌ సిటీ, చాదర్‌ఘాట్‌, రాయదుర్గం, మడికొండ, బాన్సువాడ, మామడ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఒకరేమో మితిమీరిన వేగంతో కారును నడిపారు. మరొకరేమో వేగంతో పాటు మద్యం మత్తులో కారును తోలారు. వారి ఈ నిర్లక్ష్యంతో  పెను ఘోరమే జరిగింది! వాహనాలను నడిపిన వారి ప్రాణాలే కాదు.. వాటిల్లో ప్రయాణిస్తున్న మిగతా వారి నిండు ప్రాణాలూ గాల్లో కలిశాయి. ఒక కారేమో ఎదురుగా ఆగివున్న లారీని ఢీకొని నుజ్జునుజ్జయితే..  మరో కారేమో గంటకు 170-200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలుగా విడిపోయింది.త ఈ రెండు వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక ప్రమాద మృతుల్లో ఓ కుటుంబమే తుడిచి పెట్టుకుపోయింది. భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ ప్రమాదంలోనే మరో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి ఐదుగురి పిల్లల్లో ఒకరు మృతిచెందారు. మిగతా నలుగురు పిల్లలు, వెంట వచ్చిన బంధువుల అమ్మాయికి తీవ్రగాయాలయ్యాయి! మరో ప్రమాద మృతుల్లో సినీ ఆర్టిస్టులుగా స్థిరపడాలనే ఆకాంక్షతో హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ రెండు ప్రమాదాలే కాదు.. వేర్వేరు చోట్ల మరో రెండు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు! 


దర్గాకు వెళ్లి వస్తూ.. 

హైదరాబాద్‌లోని రసూల్‌పుర నివాసి మహ్మద్‌ హుస్సెన్‌ (35), చాదార్‌ఘాట్‌లోని ముసానగర్‌ నివాసి మహ్మద్‌ ఆమేర్‌ తాజ్‌ స్నేహితులు. మహ్మద్‌ హుస్సేన్‌కు భార్య తస్లీమా బేగం (28), పదేళ్లలోపు వయసున్న ఐదుగురు... హజీరా, హురా (8), ఆదిల్‌, హిబా, సుల్తాన్‌ పిల్లలు. ఆమేర్‌ తాజ్‌ (28)కు భార్య సనా పర్వీన్‌ ఫాతిమా (24), ఇద్దరు పిల్లలు హనీయా (ఏడాదిన్నర), హన్నా (నాలుగు నెలలు) ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు మహారాష్ట్రలోని నాదేందేడ్‌లో గల కాన్‌దార్‌ దర్గాను దర్శించుకొని రావాలని నిర్ణయించుకున్నారు. మినరల్‌ వాటర్‌ వ్యాపారం చేసే మహ్మద్‌ హుస్సేన్‌కు సొంతంగా క్వాలిస్‌ వాహనం ఉండటంతో అందులోనే వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వెంట సనా పర్వీన్‌ ఫాతిమా మేనకోడలు ఆస్మా (12)ను కూడా తీసుకెళ్లారు. మొత్తంగా రెండు కుటుంబాలకు చెందిన 12 మంది శుక్రవారం దర్గా దర్శనానికి క్వాలిస్‌లో బయలుదేరారు. శనివారం తిరిగి స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. కారును ఆమేర్‌ హుస్సేన్‌ నడుపుతున్నాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపల్‌ మండలం, జుక్కల్‌కు సమీపంలోని రహదారిపై ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహ్మద్‌ హుస్సేన్‌, ఆయన భార్య తస్లీమా బేగం, వారి పాప హురా.. ఆమేర్‌ తాజ్‌, ఆయన భార్య సనా పర్వీన్‌, ఈ దంపతుల ఇద్దరు పిల్లలు హనీయా, హన్నా ప్రాణాలు కోల్పోయారు. కారు నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలు అందులో చిక్కుకుపోయాయి. మహ్మద్‌ హుస్సేన్‌ మిగతా నలుగురు పిల్లలు, సనా పర్వీన్‌ మేనకోడలు ఆస్మా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో  కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో హజీరా శరీర భాగంలో ఎముకలు పూర్తిగా విరిగిపోయాయని, ఆదిల్‌ తలకు తీవ్రగాయమైందని, అస్మా పల్స్‌రేటు పడిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా వాహనం నడపడంలో అంతగా అనుభవం లేని ఆమేర్‌ తాజ్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల ఇళ్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. 


టీ తాగేందుకు అర్ధరాత్రి కారులో.. 

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటలకు హైదరాబాద్‌ గచ్చిబౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు యువతులు సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆ ఇద్దరు యువతులు జూనియర్‌ ఆర్టిస్టులు. పోలీసులు, గాయపడ్డ యువకుడి వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలో ఉంటున్న సాయిసిద్దూ, అమీర్‌పేట హాస్టల్‌లో ఉంటున్న ఎం.మానస(19), ఎన్‌.మానస (22) జూనియర్‌ ఆర్టిస్టులు. ఎం.మానస స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల. ఎన్‌.మానసది కర్ణాటకలోని బెంగళూరు. ఈ ముగ్గురు స్నేహితులు. కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో చేశారు. ఇద్దరు మానసలకు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. సిద్దూకు ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న అబ్దుల్‌ రహీం (24) స్నేహితుడు! శుక్రవారం ఉదయం ఇద్దరు మానసలు కలిసి సిద్దూ ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు. అనంతరం రహీం, వెర్నా కారును అద్దెకు తీసుకొని అక్కడికి వచ్చాడు. రాత్రి వీరిలో రహీం విస్కీ తాగగా ఇద్దరు మానసలు బీర్‌ తాగారు. అర్ధరాత్రి 2గంటల తర్వాత ఇద్దరు మానసలు టీ తాగాలనుందని చెప్పడంతో నలుగురు కలిసి కారులో బయటకొచ్చారు. కారును రహీం నడుపుతుండగా అతడి పక్కన సిద్దూ కూర్చున్నాడు. వెనుక ఇద్దరు మానసలు కూర్చున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు  ఓ మూలమలుపు వద్ద అదుపుతప్పింది. డివైడర్‌ను తాకుతుందనే ఆందోళనతో ఒక్కసారిగా స్టీరింగ్‌ను తిప్పడంతో రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న చెట్టును కారు ఢీకొట్టింది. డ్రైవర్‌ డోరు నుంచి కారు డిక్కీ భాగం వరకు చెట్టును బలంగా తాకింది. ఆ ప్రమాదంలో కారు ముందు, వెనక సీటు భాగాలు రెండు ముక్కలుగా విడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మానసలు, కారు నడిపిన రహీం కారులోనే ఇరుక్కుపోయి దుర్మరణం చెందారు. రహీమ్‌ పక్క సీట్టో కూర్చున్న సిద్దూ గాయాయలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


 డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరుకుతామన్నా వినలేదు

నేను, రహీం,  ఇద్దరు మానసలు, అంతా కలిసి పార్టీ చేసుకున్నాం. ముగ్గురూ మద్యం తాగారు. నేను తాగలేదు. అర్ధరాత్రి 2గంటలకు దాటాక టీ తాగడానికి వెళ్దామని ఇద్దరు మానసలు గొడవ చేశారు. తొలుత నేను ఒప్పుకోలేదు. నాకు కారు నడపడం రాదు. రహీం డ్రైవ్‌ చేస్తే డ్రంకెన్‌ డ్రైవ్‌లో పోలీసులకు దొరికితే ఇబ్బంది అవుతుందని చెప్పాను. అయినా నా మాట వినలేదు.  మద్యం మత్తులో ఉన్న రహీం కారును ఓవర్‌ స్పీడుతో నడిపాడు. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నాకు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టు చేశారు జీరో వచ్చింది. నేను బతికి బయటపడతానని అనుకోలేదు.  

 -గచ్చిబౌలి కారు ప్రమాదంలో గాయపడ్డ సాయిసిద్దూ 


కల్టివేటర్‌ను ఢీ కొట్టిన బైక్‌

రోడ్డ్డు పక్కన ఉన్న కల్టివేటర్‌ను బైక్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్రవాహనమ్మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలై మృతిచెందారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం ఖండెబల్లూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జుక్కల్‌ మండలం కెంరాజ్‌కల్లాలి గ్రామానికి చెందిన  సాయిలు(32), శివగొండ(32) శనివారం మధ్యాహ్నం  జుక్కల్‌ మండల కేంద్రానికి  వెళ్లారు.  తిరుగు ప్రయాణంలో  ఖండెబల్లూర్‌ గ్రామం బాలాజీనగర్‌ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఉన్న కల్టివేటర్‌ను ఢీ కొట్టారు. తీవ్రగాయాలైన ఇద్దరినీ స్థానికులు, బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. కాగా నిర్మల్‌ జిల్లా మామడ మండలం ఆదర్శ్‌ నగర్‌ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ గాయాలు కాలేదు. 


గ్రానైట్‌ క్వారీలో టిప్పర్‌ బోల్తా

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని గ్రానైట్‌ క్వారీలో టిప్పర్‌ లారీ బొల్తాపడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మడికొండ సీఐ రవికుమార్‌ వివరాల మేరకు మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన చిత్రం చందు(20), తరాలపల్లి గ్రానైట్‌ క్వారీలో హిటాచీ ఆపరేటర్‌గా.. జార్ఖండ్‌ రాష్ట్రం దర్భంగా జిల్లా జగారువ తండాకు చెందిన మహ్మద్‌ హకీం(22) హిటాచీ హెల్పర్‌గా.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన తోకల ముఖేష్‌(23) టిప్పర్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ముఖేష్‌ టిప్పర్‌తో క్వారీలోని వృధా మట్టిని తీసుకొచ్చి మరో చోట డంపింగ్‌ చేస్తున్నాడు. చందు, హకీం టిప్పర్‌ క్యాబిన్‌లో కూర్చున్నారు. టిప్పర్‌, మట్టి లోడ్‌ను కొంత దూరం తీసుకెళ్లి డంపింగ్‌ చేస్తూ వెనుకకు వెళ్లి అలాగే కిందకు జారీ బోల్తాపడింది. సుమారు 50 అడుగుల ఎత్తునుంచి కింద బండరాళ్ళపై  పడటంతో టిప్పర్‌ క్యాబిన్‌ నుజ్జునుజ్జయి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని క్యాబిన్‌ నుంచి బయటకు తీసేటప్పటికే చందు, మహ్మద్‌ హకీం  మృతి చెందారు. ముఖే్‌షను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-19T06:58:00+05:30 IST