ఈ మామిడి తింటే మటాష్

ABN , First Publish Date - 2021-03-24T18:11:35+05:30 IST

వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు మంచి డిమాండ్. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, గోవా, కీసరా...

ఈ మామిడి తింటే మటాష్

హైదరాబాద్: వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు మంచి డిమాండ్. బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, గోవా, కీసర, లంగ్డా వంటి వందకుపైగా రకరకాల మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తూ వినియోగదారులకు నోరూరిస్తాయి. ఆరోగ్యానికి మామిడి చాలా మంచి చేస్తుంది. పిండి పదార్థాలు, చక్కెర్లు, పీచు పదార్థాలు, వివిధ విటమిన్లు, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, జింక్ వంటి ఆరోగ్య లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఆరోగ్యప్రదాయినిగా ఉన్న ఈ మామిడిపళ్లే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతున్నాయి. అవి త్వరగా పండేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు వ్యాపారులు కార్బైడ్ వంటి రసాయనాలు వాడుతున్నారు. ఇలాంటి పళ్లను తింటే ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పళ్లను సహజ పద్ధతుల్లో మగ్గబెట్టకుండా కార్బైట్ సహా వివిధ కెమికల్స్ వినియోగిస్తున్న తీరు ప్రమాదకరంగా మారిందని వైద్యులు అభిప్రాయపడ్డారు. యువతులు గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతుండడానికి ఇదొక కారణం. ఇలాంటి రసాయన పదార్థాలను వాడేవారిని నియంత్రించకపోతే పెనుముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. సహజపద్ధతుల్లో మగ్గబెట్టిన పళ్లు అందంగా ఉండవని, రసాయనాలు వాడితేనే అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయని రైతులు అంటున్నారు. కార్బైట్ వాడిన వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని.. దీంతో రసాయనాల వినియోగం తప్పడంలేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-24T18:11:35+05:30 IST