సోనియానే తెలంగాణ తల్లి

ABN , First Publish Date - 2021-07-08T07:39:02+05:30 IST

కేసీఆర్‌ ఫాంహౌస్‌లో తెలంగాణ తల్లి బందీ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. చెర నుంచి ఆ తల్లికి విముక్తి కల్పిద్దామని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ అని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

సోనియానే తెలంగాణ తల్లి

ప్రతి ఇంట్లో ఆమె చిత్రపటం పెట్టుకోవాలి

కాంగ్రెస్‌కు కార్యకర్తలే ప్రశాంత్‌ కిశోర్‌లు

రెండేళ్లు కష్టపడితే అధికారం మనదే

కేసీఆర్‌ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం

వ్యక్తిగత నినాదాలు చేస్తే సస్పెన్షన్‌ తప్పదు

మోదీ, కేసీఆర్‌.. కరోనా కన్నా ప్రమాదకరం

రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వయంపాలన లేవు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

పోటెత్తిన అభిమానం

రేవంత్‌రెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం

పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

గాంధీభవన్‌ కళకళ.. నేతల్లో ఉత్సాహం

ఉత్తేజాన్నిచ్చేలా రేవంత్‌ ప్రసంగం

వర్షాన్ని లెక్క చేయకుండా విన్న అభిమానులు


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ఫాంహౌస్‌లో తెలంగాణ తల్లి బందీ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. చెర నుంచి ఆ తల్లికి విముక్తి కల్పిద్దామని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు పట్టిన చీడ కేసీఆర్‌ అని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వయం పాలన లేవని, కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి చేతిలో నాలుగు కోట్ల మంది ప్రజలు బందీలయ్యారని ఆరోపించారు. బుధవారం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో మారీచుడు, రావణాసురుడు కేసీఆర్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియమ్మే తెలంగాణ తల్లి అన్నారు. ఎంత మంది అడ్డుపడ్డా ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ఇందుకు నాలుగు కోట్ల మంది ప్రజలు గుండెల్లో సోనియమ్మ గుడి కట్టుకుని పూజించాలని, ప్రతి ఇంట్లో సోనియాగాంధీ చిత్రపటాన్ని పెట్టుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. కార్యకర్తలు రెండేళ్లు కష్టపడితే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడానికే తనకీ బాధ్యతను సోనియాగాంధీ అప్పగించారని తెలిపారు. 


కష్టాలు తీరాలంటే.. కాంగ్రెస్‌ రావాలి!

‘‘ఆనాడు నిజాం నవాబులు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎంతో మంది సాయుధ రైతాంగ పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కలిగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటే.. సమైక్య రాష్ట్రంలో కలిపారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకుని పునాదులు వేశాడు. ఈ రోజు అమరవీరుల కుటుంబాలు సమాధుల్లోకి పోతే.. తెలంగాణ ద్రోహులు గద్దెనెక్కి మంత్రులై.. మన నెత్తి మీద డ్యాన్స్‌ చేస్తున్నారు. అమర వీరుల ఆశయాలు నెరవేరాలన్నా, తెలంగాణ కష్టాలు తీరాలన్నా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. వేలాది మంది సైనికులకు నాయకుడు ముందుండి నడిపిస్తే.. ప్రపంచాన్నే గెలవచ్చన్నారు. రాహుల్‌గాంధీ లాంటి నాయకుడు కాంగ్రెస్‌ సైన్యాన్ని నడిపించడానికి ఉన్నారని, ప్రజలను ఆశీర్వదించడానికి సోనియా గాంధీ ఉన్నారని తెలిపారు. దేశంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో పేదోడు బతికే పరిస్థితి లేదని, వారిద్దరూ కరోనా కన్నా ప్రమాదకరమని రేవంత్‌ అన్నారు. ప్రతి కార్యకర్త రెండేళ్లు ఇంట్లో సెలవు పెట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని  పిలుపునిచ్చారు.


ఉద్యోగాలిస్తే 1.91 లక్షల ఖాళీలెలా ఉన్నాయి?

తెలంగాణ ఏర్పడిన తర్వాత 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని శాసనసభలో సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఇటీవల నియమించిన కమిటీ ఇంకా 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పిందని రేవంత్‌ గుర్తు చేశారు. ఏడేళ్లలో ఉద్యోగాలిస్తే.. ఖాళీలు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎన్‌కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ ఆదుకోలేదని, ఉద్యమకారులపై కేసులను తొలగించలేదఅన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ కేసీఆర్‌ అని విమర్శించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబ గులాబీ చీడను పొలిమేరలు దాటేవరకు తరమాలని ధ్వజమెత్తారు. సీతాదేవిని రావణసురుడు ఎత్తుకెళ్లి లంకలో బంధించినట్లుగా.. తెలంగాణ తల్లిని కేసీఆర్‌ చెరబట్టి ఫాంహౌ్‌సలో బంధించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీతమ్మను విడిపించడానికి బయలుదేరిన శ్రీరాముడికి వానరసైన్యం వారధి కట్టినట్లుగా.. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో బందీ అయిన తెలంగాణ తల్ల్లికి విముక్తి కల్పించడానికి కార్యకర్తలు వారధి కట్టాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని అన్నారు.


బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన సభలో జెండాను ఆవిష్కరిస్తున్న రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి, మధుయాష్కీ, అజారుద్దీన్‌, గీతారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు


మా ప్రశాంత్‌ కిషోర్‌లు మీరే!

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రశాంత్‌ కిషోర్‌ను సలహాదారుగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారని, కానీ.. తమకు కార్యకర్తలే ప్రశాంత్‌ కిషోర్‌లని రేవంత్‌ అన్నారు. కాంగ్రె్‌సకు పాదరసం లాంటి కార్యకర్తలున్నారని, వాళ్లే ఏకే 47 తుటాల్లా టీఆర్‌ఎస్‌ గుండెల్లో గునపాలు దింపుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారాలంటే ప్రతి కార్యకర్తా పాదరసంలా మారాలని, గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ విధానాలను చెప్పలని అన్నారు. సోనియాగాంధీ ఏ పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్‌ పదే పదే కేసీఆర్‌ అంటుంటారని, కానీ.. ఆయన నిజాం ఆస్పత్రిలో బోర్లబొక్కల పడుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో చచ్చిపోయి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. మనం కొట్లాడిన, చచ్చినా రాని తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని, ఆమె పట్ట కృతజ్ఞత చూపించాలని అన్నారు. 


వ్యక్తిగత నినాదాలు చేస్తే బహిష్కరిస్తా! 

రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే కొందరు కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ  నినాదాలు చేశారు. దీంతో రేవంత్‌ కోపోద్రిక్తుడయ్యారు. ఈ రోజు నుంచి జై సోనియమ్మ, జై కాంగ్రెస్‌ తప్ప.. ఎవరైనా వ్యక్తిగతంగా నినాదాలిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీని సమష్టి నిర్ణయాలు, సమష్టి పోరాటాలతో అధికారంలోకి తెచ్చేందుకే తనకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని అన్నారు. ఇకపై ఎవరూ వ్యక్తిగత నినాదాలు చేయొద్దన్నారు. 

Updated Date - 2021-07-08T07:39:02+05:30 IST