ఆందోళన వద్దు... అందరికంటే మనం బెటర్ : సీఎస్ సోమేశ్ కుమార్

ABN , First Publish Date - 2021-05-05T20:51:38+05:30 IST

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో కాస్త అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు

ఆందోళన వద్దు... అందరికంటే మనం బెటర్ : సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా తెలంగాణలో కాస్త అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్, ఆక్సిజన్, పడకలకు ఎలాంటి లోటూ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సోమేశ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని, ప్రతి ఆస్పత్రిలో పడకలతో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తమకు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినా, ప్రతి నిత్యం తమతో సమీక్షలు చేశారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్‌కు హబ్‌గా తయారైందని, కరోనాకు భయపడాల్సిన అవసరమే లేదని భరోసా కల్పించారు. ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడికే చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని, తాము మాత్రం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు. 


కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తెలంగాణకు రావాల్సిన సిలిండర్లు, రెమిడేసివిర్ ఇంజక్షన్లను పంపమని అడిగామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల కోవిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కొందరు అనవసరంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నారని, లక్షణాలుంటేనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ 42 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ను అందించామని, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ భరోసా కల్పించారు. 


Updated Date - 2021-05-05T20:51:38+05:30 IST