అన్వితకు ఆ మంచుకొండ సలామ్!
ABN , First Publish Date - 2021-12-09T07:17:30+05:30 IST
తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన

- రష్యాలోని ఎల్బ్రస్ను అధిరోహించిన తెలంగాణ బిడ్డ
భువనగిరిటౌన్, డిసెంబరు 8: తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 24 ఏళ్ల అన్విత అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. రష్యాలో మంచుతో కప్పబడి ఉండే 18,510 అడుగుల ఎల్బ్రస్ పర్వతాన్ని ఆమె అధి రోహించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయులు ఆమే కావడం విశేషం. మైనస్ 40 డిగ్రీల చలిలో ఈనెల 4వ తేదీన మైనస్ 40 డిగ్రీలతో కూడిన ప్రతికూల వాతా వరణం మధ్య పర్వతారోహణను ప్రారంభించి. 7న శిఖరంపైకి చేరుకున్నారు.
అన్విత స్వ స్థలం భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామం. తల్లిదండ్రులు పడమటి మదుసుధన్‌రెడ్డి చంద్రకళ. తండ్రి వ్యవసాయం చేస్తారు. తల్లి అంగన్వాడీ టీచర్. అన్విత ఎంబీఎ పూర్తిచే శారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో చేరి భువనగిరి ఖిల్లాపైనే 2014 నుంచి పర్వాతారోహణపై శిక్షణ తీసుకుంటున్నారు. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎతైన రీనాక్ పర్వతాన్ని, 2019లో అదే రాష్ట్రంలోని 6,400 మీటర్ల ఎత్తైన బిసిరాయ్ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, 2021 పిబ్రవరిలో లడక్‌లోని 6000 మీటర్ల ఎతైన ఖడే పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఈ క్రమంలో రష్యాలోని 5,600 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్బ్రస్ మంచు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆమె గత నెల 28న రష్యా చేరుకున్నారు. ఒక సహాయకుడితో కలిసి ఎల్బ్రస్ పర్వత శిఖరంపైకి చేరుకొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం ఆమె భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆమె, ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల అధిరోహించడమే తన లక్ష్యమని చెప్పారు.