స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యమెందుకు?
ABN , First Publish Date - 2021-08-26T05:17:25+05:30 IST
స్మార్ట్‌సిటీ పనుల్లో జాప్యమెందుకు?

వరంగల్ సిటీ, ఆగస్టు 25 : స్మార్ట్‌సిటీ పనులను సకాలంలో పూర్తి చేయడంలో జాప్యమేమిటని మేయర్ గుండు సుధారాణి బల్దియా ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ప్రశ్నించారు. బుధవారం వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేయర్.. అధికారులపై మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను గడువులోగా పూర్తి చేయకుంటే ఇక ఏంచేస్తున్నట్లు అని నిలదీశారు. సాకులు చెబితే ఊరుకునేది లేదన్నారు. పనులు పూర్తి చేయకుండా సాగదీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏజెన్సీలు నిర్లక్ష్యం చేస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రాంపూర్ డంపింగ్ యార్డు వద్ద రూ.36 కోట్లతో చేపట్టే బయోమైనింగ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. సర్వే పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఉర్సు గుట్ట వద్ద 5 ఎంఎల్‌డీ, ప్రగతినగర్‌లో 15 ఎంఎల్‌డీల సామర్థ్యం గల ఎస్‌టీపీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హనుమకొండ రెడ్డిపురంలో 100ఎంఎల్‌డీ సామర్థ్యం ఎస్‌టీపీ పనులను ప్రారంభించాలన్నారు. స్మార్ట్ రోడ్లు ఫేజ్-1 కింద చేపట్టిన రోడ్-4 పనులు ముగిసినందున చివరి నెలలో ప్రారంభించాలని సూ చించారు. డిసెంబరు నాటికి మిగతా మూడు రహదారులు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అక్టోబ రు నాటికి నగరం నలువైపులా నిర్మించే ముఖద్వారాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. భద్రకాళి బం డ్ ఫేజ్-2, లాండ్రీ మార్ట్ పనులను సమీక్షించారు. ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివా్‌సరావు, రాజయ్య పాల్గొన్నారు.