సకల ‘శాల’

ABN , First Publish Date - 2021-02-01T08:25:56+05:30 IST

చక్కని పచ్చికతో కూడిన వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు.. విశాలమైన ప్రాంగణం.. పెద్ద సంఖ్యలో గదులతో కూడిన ఈ భవనం ఓ సర్కారు బడి అంటే నమ్మాలి! సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల

సకల ‘శాల’

అన్ని హంగులతో సిద్ధమైన సిరిసిల్ల ఉన్నత పాఠశాల 

నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం


సిరిసిల్ల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): చక్కని పచ్చికతో కూడిన వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ కోర్టులు.. విశాలమైన ప్రాంగణం.. పెద్ద సంఖ్యలో గదులతో కూడిన ఈ భవనం ఓ సర్కారు బడి అంటే నమ్మాలి! సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల కొత్త భవనమిది. కార్పొరేట్‌ స్కూలు సైతం దిగదుడుపు అన్న విధంగా విద్యార్థుల కోసం సకల సౌకర్యాలతో సిద్ధమైంది. ఫిబ్రవరి 1న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. 600 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. 1962లో దీన్ని పది గదులతో  కట్టారు. అది పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పిల్లలకు చెట్ల కిందే తరగతులు నిర్వహించేవారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ బడి రూపురేఖలే మారిపోయాయి. కొత్త పాఠశాల భవనం కోసం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ (సీఎ్‌సఆర్‌) కింద రూ. 3 కోట్లను కేటాయించారు. పాత స్కూలును కూల్చేసి  కార్పొరేట్‌ హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు.  


20 తరగతి గదులు.. 350 డెస్క్‌లు.. 

ఈ పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దారు. 20 తరగతి గదులతో భవనాన్ని నిర్మించారు. అందులో 350 డెస్క్‌లు ఉన్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. 32 కంప్యూటర్లతో కూడిన ఈ ల్యాబ్‌లో ఇంటర్‌నెట్‌ సౌకర్యాం కల్పించారు. 400 మంది విద్యార్థులు కూర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్‌ హాళ్లు నిర్మించారు. భద్రతలో భాగంగా 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆధునిక వసతులతో టాయిలెట్లు కట్టారు.   ఫుట్‌బాల్‌ కోర్టు, వాలీబాల్‌ కోర్టు, ఇతర ఆటలు ఆడుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-02-01T08:25:56+05:30 IST