15 కేంద్రాల్లో శూన్య స్థాయికి బొగ్గు నిల్వలు

ABN , First Publish Date - 2021-10-14T08:49:07+05:30 IST

దేశంలో 15,290 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 15 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు శూన్య స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా...

15 కేంద్రాల్లో శూన్య స్థాయికి బొగ్గు నిల్వలు

  • తెలంగాణలోని కేంద్రాల్లో నాలుగు రోజుల నిల్వలే
  • ప్లాంట్‌లకు బొగ్గు అందించలేని స్థితిలో సింగరేణి

హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): దేశంలో 15,290 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 15 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు శూన్య స్థాయికి చేరాయి. దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 135 థర్మల్‌ విద్యుత్కేంద్రాలు ఉండగా.. వాటిలో సగటున 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 35,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 16 ప్లాంట్లు మాత్రమే పిట్‌హెడ్‌(బొగ్గు గని ఉదర భాగం)లో ఉన్నాయి. వీటిలో 5 రోజులకు సరిపడా బొగ్గు ఉంది. రైలు, రోడ్డు మార్గంలో బొగ్గును పొందే 1,29,866 మెగావాట్ల సామర్థ్యం 119 ప్లాంట్లలో 4 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇక 3 రోజులకు సరిపడా నిల్వలు ఉన్న ప్లాంట్లకు కాకుండా అసలే నిల్వలు లేని ప్లాంట్లకు బొగ్గు అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని బొగ్గు ఉత్పత్తి సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇక ఒప్పందం ఉన్న థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు అందించడంలో సింగరేణి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటకలోని బళ్లారి, కుడ్గి, రాయ్‌చూరు, యర్‌మారస్‌ ప్లాంట్లకు సింగరేణి సంస్థతో బొగ్గు ఒప్పందం ఉంది. సింగరేణి దెబ్బతో రాయ్‌చూరు, బళ్లారిలోని ప్లాంట్లు మూతపడి, తర్వాత తెరుచుకున్నాయి.


బళ్లారి ప్లాంట్‌లో 2 రోజులకు సరిపడా నిల్వ మాత్రమే ఉండగా.. కుడ్గిలో ఒక రోజు.. రాయ్‌చూరులో 3 రోజులు.. యర్‌మార్‌సలో ఒక రోజు నిల్వలే ఉన్నాయి. తెలంగాణలో భూపాలపల్లిలోని జెన్‌కోకు చెందిన ప్లాంట్‌ మినహా మిగతా కేంద్రాల్లో నిరాశా జనకంగానే బొగ్గు ఉంది. రామగుండం థర్మల్‌ కేంద్రంలో 3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. మణుగూరులోని భద్రాద్రి, కొత్తగూడెంలోని కేటీపీఎస్‌ ప్లాంట్లలో 4 రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. ఇక సింగరేణితో ఒప్పందం కలిగి ఉన్న మహారాష్ట్రలోని పలు పవర్‌ ప్లాంట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. సింగరేణితో పాటు ఇతర సంస్థలు బొగ్గును సరిపడా అందించలేక పోతున్నాయని కేంద్రం గుర్తు చేసింది. 


బొగ్గు రవాణాపై చర్యలు తీసుకోవాలి: ఎస్సీఆర్‌ జీఎం

బొగ్గు నిల్వలపై క్లిష్ట పరిస్థితి దృష్ట్యా విద్యుత్తు ప్లాంట్లకు నిరాటంకంగా బొగ్గు రవాణాకు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఆదేశించారు. బొగ్గు సరఫరాలో వేగవంతం కోసం త్రిశూల్‌, గరుడ వంటి భారీ రైళ్లను మరిన్ని నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం నుంచి రైల్వేలోని వివిధ విభాగాల అధికారులు, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ డీఆర్‌ఎమ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం ఆయన   సమీక్షించారు. రైల్వేలో ఇంధన పొదుపు చర్యలు, శుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన పర్యావరణ సమతుల్యతపై ఈ-పుుస్తకాన్ని ఆవిష్కరించారు. 

Updated Date - 2021-10-14T08:49:07+05:30 IST