వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావం నేడే

ABN , First Publish Date - 2021-07-08T07:54:46+05:30 IST

తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. గురువారం తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఆమె తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎ్‌సఆర్‌

వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావం నేడే

వేదిక జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌ 

పార్టీ జెండానూ ఆవిష్కరించనున్న షర్మిల

ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు

అక్కడి నుంచి ర్యాలీగా.. 

తల్లి ఆశీర్వచనాలు తీసుకుని పార్టీని ప్రకటించనున్న షర్మిల


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. గురువారం తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఆమె తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీ పేరు వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అన్న సంగతి తెలిసిందే. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండానూ షర్మిల ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి బుధవారం ఏపీలోని ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల.. గురువారం ఉదయం తండ్రి సమాధి ముందు పార్టీ జెండాను ఉంచి ఆశీర్వాదం తీసుకుంటారు.


వైఎస్‌ఆర్‌ సతీమణి విజయలక్ష్మి, పార్టీ ముఖ్యనేతలు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల, వైఎస్‌ విజయలక్ష్మి, రాఘవరెడ్డి, రాంరెడ్డి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఫంక్షన్‌ హాల్‌కు ర్యాలీగా వెళతారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు షర్మిల ప్రసంగం ప్రారంభం కానుంది. పార్టీ పేరును ప్రకటించి, జెండానూ ఆమె ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా తన తల్లి వైఎస్‌ విజయలక్ష్మి ఆశీర్వచనాలు ఆమె తీసుకోనున్నారు. అనంతరం తెలంగాణలో తాను పార్టీ ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక ఇక్కడ జాతీయ పార్టీలు ఎందుకు విఫలమవుతున్నాయి? తదితర వివరాలను షర్మిల వెల్లడిస్తారు. కాగా, వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయడం, పేరు పట్ల ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఏ రోజునైనా రిజిస్టర్‌ అయినట్లుగా సర్టిఫికెట్‌ రావచ్చునని పార్టీ వర్గా లు చెబుతున్నాయి. పార్టీని రిజిస్టర్‌ చేసినట్లుగా ఈసీ ప్రకటించిన వెంటనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ నిర్మాణంపైన దృష్టి పెడతామని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. 


చిలుకూరు ఆలయంలో పూజలు 

షర్మిల పార్టీకి సంబంధించి జెండా, ఆమె ధరించనున్న కండువాలకు చిలుకూరు బాలాజీ దేవస్థానంలో పార్టీ ముఖ్యనేత కొండా రాఘవరెడ్డి పూజలు చేయించారు. తెలంగాణ పటంలో వైఎ్‌సఆర్‌ బొమ్మతో పార్టీ జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే.  


రాజన్న పాలనే ధ్యేయం: రాఘవరెడ్డి 

షర్మిల ప్రారంభించనున్న పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎ్‌సఆర్‌ అభిమానులతోపాటు అందరికీ ఆహ్వానం ఉంటుందని వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. జేఆర్‌సీ కన్వెన్షన్‌లో బుధవారం విలేకర్ల సమావేశంలో పార్టీ ఏర్పాటు, ప్రారంభోత్సవ వివరాలను ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ప్రజలు సంతోషంగా లేరన్నారు. వైఎ్‌సఆర్‌ తరహాలో సంక్షేమ పాలనను తెలంగాణ ప్రజలకు అందించేందుకు కృషి చేయడమే పార్టీ ధ్యేయంగా ఉంటుందని ఆయన చెప్పారు.


పంజాగుట్టలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళి

షర్మిల గురువారం ఉదయం ఏపీలోని ఇడుపులపాయ నుంచి 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆమెకు బోనాలతో మహిళలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వైఎస్‌ఆర్‌ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ ప్రముఖులతో కలిసి ర్యాలీగా పంజాగుట్ట చేరుకుని సర్కిల్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడినుంచి జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు.

Updated Date - 2021-07-08T07:54:46+05:30 IST