రెండు కార్లు ఢీకొని ఏడుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-24T07:35:54+05:30 IST

రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామ సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేపై చో

రెండు కార్లు ఢీకొని ఏడుగురి దుర్మరణం

దైవ దర్శనానికి వెళ్తూ నలుగురు.. తిరుగు ప్రయాణంలో ముగ్గురి మృతి

మరో యువకుడికి తీవ్రగాయాలు.. శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం

మృతులు గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు.. బాధిత కుటుంబాలకు 2 లక్షలు: కేంద్రం

అచ్చంపేట/ఉప్పునుంతల, జూలై 23: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామ సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేపై చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు శ్రీశైలంలో భ్రమరాంబికామల్లికార్జునుల దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. మిగతా నలుగురు దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సుచిత్ర ప్రాంతానికి చెందిన శివకుమార్‌(50), మూర్తి(60), సుబ్బలక్ష్మి(55), శివ అనే చిన్నారి కారులో శ్రీశైల దర్శనానికి శుక్రవారం ఉదయం బయలుదేరారు. నిజాంపేట్‌లోని ఓ కొరియర్‌ కార్యాలయంలో పనిచేసే స్నేహితులు-- జీడిమెట్లకు చెందిన వంశీకృష్ణ(25), నిజాంపేటకు చెందిన తలారి వెంకటేశ్‌(32), సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం గండిగూడెంకు చెందిన నరేశ్‌(27), కార్తీక్‌  శ్రీశైలంలో అమ్మవారు, స్వామివార్ల దర్శనం చేసుకుని, కారులో తిరుగు ప్రయాణమయ్యారు. 


ఈ రెండు కార్లు పిరట్వానిపల్లి సమీపానికి రాగానే.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేశ్‌ మినహా.. మిగతా ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎస్పీ సాయిశేఖర్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్బలక్ష్మి మృతదేహం పూర్తిగా చితికిపోయిందని, ముఖం గుర్తుపట్టలేనంతగా నలిగిపోయిందని పోలీసులు తెలిపారు. రెండు కాళ్లు విరిగి, తీవ్ర గాయాలపాలైన నరేశ్‌ను చికిత్స నిమిత్తం తొలుత అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రెమిడీ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించాలంటూ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై ట్విటర్‌లో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున.. క్షతగాత్రుడి వైద్య ఖర్చుల కోసం రూ. 50వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంతో శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సుమారు గంటసేపు ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడే నిలిచిపోయింది.


ప్రమాదాలకు అడ్డా..

శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చెన్నారం స్టేజీ పరిసరాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఐదేళ్లుగా ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం నాటి ఘోర రోడ్డు ప్రమాదంతో ఇక్కడి ప్రజలు మరోమారు ఉలిక్కిపడ్డారు. గతంలో మహారాష్ట్రకు చెందిన ఓ వాహనం కల్వర్టును ఢీకొని ఒకరు మృతిచెందారు. మరో ఘటనలో శ్రీశైలం నుంచి వస్తున్న కారు చెట్టును ఢీకొని ఇద్దరు దుర్మరణంపాలయ్యారు. గత ఏడాది కూడా రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందారు. ద్విచక్రవాహన ప్రమాదాల్లోనూ మరణాలు సంభవించాయి. ఎందరో క్షతగాత్రులయ్యారు. మలుపులు, ఎత్తుపల్లాలు అధికంగా ఉండడం.. ప్రమాద హెచ్చరికలు, స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-24T07:35:54+05:30 IST