వ్యాక్సిన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-06-21T09:18:29+05:30 IST

ప్రపంచ వ్యాక్సిన్‌ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో టీకా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

వ్యాక్సిన్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయండి

  • టీకాల హబ్‌ హైదరాబాద్‌లో ఇది అత్యవసరం
  • మంజూరు చేస్తే జీనోమ్‌ వ్యాలీలో భూమి కేటాయిస్తాం
  • కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాక్సిన్‌ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో టీకా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, సదానంద గౌడకు ఆదివారం ఆయన లేఖలు రాశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా తయారు చేసిన తొలి కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తి అవుతోన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. అలాగే, స్పుత్నిక్‌-వి, కోర్బావాక్స్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లను ఆయా కంపెనీలు ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించాయని తెలిపారు. ఈ ఏడాది ఆఖరి కల్లా 50% వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన టీకాల ఉత్పత్తి  హైదరాబాద్‌లోనే జరగనుందని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో సుమారు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లు తయారు చేసే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు.


 ఇంతటి ప్రాధాన్యం కలిగిన హైదరాబాద్‌లో టీకా పరీక్ష కేంద్రం లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే ప్రతి బ్యాచ్‌ వ్యాక్సిన్లను హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉన్న టీకా పరీక్ష కేంద్రానికి పంపడం సవాల్‌గా మారిందన్నారు. మొత్తం పరీక్ష ప్రక్రియకు 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా విలువైన సమయం వృథా అవుతుందని హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు తెలిపాయన్నారు. దేశంలో రెండో టీకా పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ద్వారా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తద్వారా వ్యాక్సిన్‌ కంపెనీలకు మరింత సౌకర్యవంతంగా ఉండడంతోపాటు ప్రతి నెలా 8 నుంచి 10 కోట్ల అదనపు వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేసే వీలుంటుందన్నారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే, జీనోమ్‌ వ్యాలీలో స్థలం కేటాయించడంతోపాటు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.  

Updated Date - 2021-06-21T09:18:29+05:30 IST