పనులు, పదవులు అమ్ముకుంటున్నారు..

ABN , First Publish Date - 2021-03-22T07:41:18+05:30 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పనులు, పదవులు అమ్ముకుంటున్నారు..

చెల్లని రూపాయి గురించి మాట్లాడను

ఎమ్మెల్యే రాజయ్యపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు

జనగామ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యపై మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండలం ఓబులాపూర్‌లో శనివారం జరిగిన వరంగల్‌ ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ క్రీడల ముగింపు సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీహరి అని ప్రజలు చెప్పుకునేలా సేవలందించాను’ అని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రాజయ్య వర్గీయులైన ఇద్దరు కార్యకర్తలు కడియం ప్రసంగానికి అడ్డు తగిలేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల నినాదాలతో వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు తీసుకువెళ్లారు. ‘చేతకానివాడు.. ఇలాంటి ఆటల పోటీలకు కనీసం రూ.50 వేలు సాయం చేయని వాడు, చెల్లని రూపాయి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంత మగాడివైతే కబడ్డీ క్రీడలకు ఒక్క రూ.50 వేలు ఎందుకు ఇయ్యలేదు? ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నరు? నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర చాయ్‌ తాగినా, పనులు, పదవులు ఇప్పిస్తానని ఒక్క రూపాయి తీసుకున్నా ఇక్కడే ముక్కునేలకు రాస్తా. ఇవ్వాల పనులు, పదవులు అమ్ముకుంటున్నారు. సిగ్గులేని వాళ్లు వచ్చి మాట్లాడుతున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-03-22T07:41:18+05:30 IST