హైదరాబాద్‌, కరీంనగర్‌లలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

ABN , First Publish Date - 2021-02-26T07:44:30+05:30 IST

హైదరాబాద్‌, కరీంనగర్‌లలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్‌ ఈదిబజార్‌లో వెయ్యి కిలోల గన్‌ పౌడర్‌, కరీంనగర్‌లో 14 క్వింటాళ్ల గన్‌ పౌడర్‌, 2 వేల

హైదరాబాద్‌, కరీంనగర్‌లలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

14 క్వింటాళ్ల గన్‌పౌడర్‌, 2 వేల డిటోనేటర్లు స్వాధీనం

నలుగురి అరెస్టు, అదుపులో మరికొందరు 


చాంద్రాయణగుట్ట, కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 25: హైదరాబాద్‌, కరీంనగర్‌లలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్‌ ఈదిబజార్‌లో వెయ్యి కిలోల గన్‌ పౌడర్‌, కరీంనగర్‌లో 14 క్వింటాళ్ల గన్‌ పౌడర్‌, 2 వేల డిటోనేటర్లను పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌ ఈదిబజార్‌కు చెందిన మహ్మద్‌ జైనుల్లా బీడెస్‌ షబీర్‌ (57), శాలిబండకు చెందిన హమీద్‌ ఖాన్‌ (49)లు అక్రమంగా గన్‌పౌడర్‌, డిటోనేటర్లను తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి వెయ్యి కిలోల గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకుని, వారిని అరెస్టు చేశారు. అయితే, వీరిద్దరూ గన్‌పౌడర్‌ను కరీంనగర్‌లోని హెచ్‌ఎంటీ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా సిద్ధిపేటకు చెందిన అందె విష్ణువర్ధన్‌రెడ్డికి, శ్రీరామ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా కరీంనగర్‌లోని సాయినగర్‌కు చెందిన అనసూరి సతీశ్‌ కుమార్‌కు పంపించారు. 


దీంతో కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి శ్రీరామ, హెచ్‌ఎంటీ ట్రాన్స్‌పోర్ట్‌లలో తనిఖీలు నిర్వహించి 14 క్వింటాళ్ల గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సతీశ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని ఇంటి వద్ద 2వేల డిటోనేటర్లు పట్టుబడ్డాయి. కాగా, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీలకు ఈ గన్‌ పౌడర్‌, డిటోనేటర్లు సరఫరా చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. షబ్బీర్‌కు చెందిన ఆయుధ దుకాణంలో అక్రమంగా తయారైన గన్‌ పౌడర్‌, డిటోనేటర్లు కరీంనగర్‌కు ట్రాన్స్‌పోర్ట్‌లో తరలించి ఇక్కడి నుంచి తీవ్రవాద సంస్థలకు కొరియర్‌ల ద్వారా చేరవేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గన్‌పౌడర్‌, డిటోనేటర్లను కరీంనగర్‌కు తీసుకొచ్చిన విష్ణువర్ధన్‌రెడ్డి, సతీశ్‌ కుమార్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారిని లోతుగా విచారిస్తున్నారు.   

Updated Date - 2021-02-26T07:44:30+05:30 IST