విత్తన ప్రణాళిక సరే.. రాయితీలెప్పుడు?...

ABN , First Publish Date - 2021-10-31T09:22:55+05:30 IST

యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ...

విత్తన ప్రణాళిక సరే.. రాయితీలెప్పుడు?...

సబ్సిడీపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. 5.90 లక్షల క్వింటాళ్ల విత్తనాల లభ్యత ఉన్నట్లు వ్యవసాయ శాఖ నివేదిక

 అందులో 3.25 లక్షల క్వింటాళ్ల వేరుశనగలు రైతులవే

 విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఉన్నవి లక్ష క్వింటాళ్లే

అది కూడా అన్ని పంటల విత్తనాలు కావు

 ప్రైవేటు కంపెనీల వద్ద 11 రకాల విత్తనాలు లక్ష క్వింటాళ్లు


హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... విత్తన సబ్సిడీపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండేళ్ల క్రితమే విత్తన రాయితీని ఎత్తివేసినా.. ఈసారి యాసంగిలో రైతులను ఇతర పంటల వైపు మళ్లించి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడానికి విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. వ్యవసాయశాఖ ప్రణాళిక తయారుచేసి, రాయితీని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఽఫైలు పంపించింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో సందిగ్ధత నెలకొంది. శనగ, వేరుశనగ, నువ్వులు, పెసర, మినుములు, జొన్న, పొద్దుతిరుగుడు, ఆవాలు, ఆముదం, కంది, మొక్కజొన్న విత్తనాలు 5.90 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో పేర్కొంది.


అయితే ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల వద్ద చాలా స్వల్పంగా విత్తనాలు ఉన్నాయి. సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వద్ద లక్ష క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పైగా యాసంగిలో ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని పంటల విత్తనాలు లేవు. శనగలు 79 వేల క్వింటాళ్లు, వేరుశనగలు 8,500, పెసర్లు 2 వేలు, మినుములు 4,500, నువ్వులు 210, కందులు 6,800, మొక్కజొన్న విత్తనాలు 162 క్వింటాళ్లు మాత్రమే తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ వద్ద ఉన్నాయి. ఏడు రకాల విత్తనాలు కలిపి లక్ష క్వింటాళ్లకు మించి లేవు. ఇవి ఏమూలకూ సరిపోవవని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఇక నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎ్‌ససీ) వద్ద 62 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయి. అవీ నాలుగు రకాలే. శనగలు 41 వేల క్వింటాళ్లు, వేరుశనగలు 15,500, పెసర్లు 3,300, మినుములు 1,800 క్వింటాళ్లు ‘ఎన్‌ఎ్‌ససీ’ వద్ద ఉన్నాయి.


ఇవి కాకుండా మిగిలిన విత్తనాలన్నీ ప్రైవేటు కంపెనీల వద్ద ఉన్న నిల్వలు, రైతుల వద్ద ఉన్న నిల్వల లెక్కలను ప్రణాళికలో చూపించారు. విచిత్రమేమిటంటే... యాసంగిలో వేరుశనగను విరివిగా సాగుచేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వరంగ విత్తన సంస్థల వద్ద 24 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 3.25 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతుల వద్ద ఉన్నట్లు లెక్కలు చూపించడం గమనార్హం. అదేక్రమంలో ప్రైవేటు కంపెనీల వద్ద 11 రకాల విత్తనాలు లక్ష క్వింటాళ్లు ఉన్నట్లు వెల్లడించారు.


సబ్సిడీ కోసం రైతుల ఎదురుచూపులు

విత్తన సబ్సిడీల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలకు 33 శాతం నుంచి 50 శాతం వరకు ఇచ్చేవారు. మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో విత్తనాలను అందుబాటులో ఉంచేవారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం విత్తన సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. నిరుడు వానాకాలంలో జనుము, పిల్లిపెసర, జీలుగ విత్తనాలకు మాత్రమే రాయితీ ఇచ్చింది. వేరుశనగ, శనగ, నువ్వులు, పెసర, మినుము, జొన్న, పొద్దుతిరుగుడు, ఆవాలు, ఆముదం, కంది, మొక్కజొన్న విత్తనాలను రాయితీపై సరఫరా చేస్తే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.


మరోవైపు మార్కెట్లో విత్తనాల ధరలు మండిపోతున్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాలైతే దొరకడమే లేదు. పైగా నాణ్యతలేని, కల్తీ విత్తనాలను జోరుగా అమ్ముతున్నారు. రైతులు ప్రతి సీజన్‌లో వీటిని కొని మోసపోతున్నారు. రైతులకు విత్తనాలు సరఫరా చేయాల్సిన రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ ప్రేక్షకపాత్ర వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-10-31T09:22:55+05:30 IST