మోగిన బడి గంట

ABN , First Publish Date - 2021-02-02T05:16:02+05:30 IST

మోగిన బడి గంట

మోగిన బడి గంట

10 నెలల తర్వాత పునఃప్రారంభమైన పాఠశాలలు

ఉమ్మడి వరంగల్‌లో తొలిరోజు 40.64 శాతం హాజరు

విద్యార్థులకు శానిటైజేషన్‌.. పకడ్బందీగా రక్షణ చర్యలు


హన్మకొండ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : పది నెలల విరామం తర్వాత పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులు సోమవారం ఉత్సాహంగా హాజరయ్యారు. తొలిరోజు తరగతులకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 40.64 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1127 ఉన్నత పాఠశాలలు ఉండగా వీటిలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు మొత్తం 89,864 ఉన్నారు. మొదటి రోజు తరగతులకు వీరిలో 39,198 మంది(40.64 శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 394 పాఠశాలలు ఉండగా వీటిలో 34,056 మంది విద్యార్థులకు 16,213 (47.61 శాతం), వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 220 పాఠశాలల్లో 14429 మంది విద్యార్థులకు 6,462 (44.78 శాతం) మంది, జనగామ జిల్లాలో 176 పాఠశాలల్లో 14,526 విద్యార్థులకు 7159 (49.28 శాతం) మంది, మహబూబాబాద్‌ జిల్లాలో 124 పాఠశాలల్లో 10,337 మంది విద్యార్థులకు 5080(50 శాతం) మంది, ములుగు జిల్లాలో 144 పాఠశాలల్లో 8541 మంది విద్యార్థులకు 1810 (21.19 శాతం), జయశంకర్‌ జిల్లాలో 220 పాఠశాలల్లో 14429 మంది విద్యార్థులకు 6462 (44.78 శాతం) మంది హాజరయ్యారు. ములుగు జిల్లాలో అతి తక్కువ హాజరు శాతం నమోదైంది.

ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల రాక మొదలైంది. గంట ముందే పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన అధ్యాపకు లు, సిబ్బంది ఏర్పాట్లను మరోసారి సరిచూసుకున్నారు. ప్రభు త్వం జారీ చేసిన కొవిడ్‌ మార్గదర్శక సూత్రాల ప్రకారం విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతిచ్చారు. స్కూల్లో అడుగుపెట్టిన విద్యార్థులందరినీ ఆవరణలోనే దూరం దూరంగా నిలబెట్టారు. తల్లిదండ్రుల నుంచి తీసుకువచ్చిన సమ్మతి పత్రాలను పరిశీలించారు. థర్మల్‌స్ర్కీనింగ్‌ ద్వారా పరీక్షించారు. తర్వాత వారి చేతులను శానిటైజ్‌ చేశారు. తరగతి గదుల్లో  బెంచీకి ఒకరిని మాత్రమే కూర్చోబెట్టారు. గదులను పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా శానిటైజ్‌ చేసుకున్నారు. మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తించారు. ఎంఈవోలు తమ పరిధిలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రత్యేకాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు కూడా రాండమ్‌గా కొన్ని పాఠశాలలను సందర్శించారు.  

పది నెలలుగా మూతపడిన పాఠశాలలకు కొత్త కళ వచ్చింది. విద్యార్థులతో సందడిగా మారాయి. కరోనా దృష్ట్యా పారిశుధ్య పనులు చేపట్టడంతో పాఠశాలలు ముస్తాబైనట్టు కనిపించాయి.  కరోనా కారణంగా సిలబ్‌సను 30 శాతం తగ్గించినందున ముందుగా రూపొందించిన పాఠ్యప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయులు, అధ్యాపకులు బోధన ప్రారంభించారు.  

Updated Date - 2021-02-02T05:16:02+05:30 IST