10వ తరగతి మార్కుల బాధ్యత స్కూళ్లకే

ABN , First Publish Date - 2021-05-02T09:01:53+05:30 IST

10వ తరగతి మార్కింగ్‌ విధానాన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) వెల్లడించింది.

10వ తరగతి మార్కుల బాధ్యత స్కూళ్లకే

  • మార్కుల గణనకు సీబీఎ్‌సఈ మార్గదర్శకాలు
  • సంవత్సరం మొత్తమ్మీద చూపిన ప్రతిభే ఆధారం
  • రాష్ట్రంలో టెన్త్‌ మార్కుల విధానంపై త్వరలో స్పష్టత 


హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): 10వ తరగతి మార్కింగ్‌ విధానాన్ని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వార్షిక పరీక్షలను రద్దుచేసిన సీబీఎ్‌సఈ.. ప్రతి సబ్జెక్టులోనూ ఇంటర్నల్స్‌ను ఎప్పటిలాగే 20 మార్కులకు పరిగణనలోకి తీసుకోనుంది. స్కూల్లో సంవత్సరం మొత్తమ్మీద వివిధ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభకు మిగతా 80 మార్కులు కేటాయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సీబీఎ్‌సఈ శనివారం విడుదలచేసింది. మార్కులను కేటాయించే బాధ్యతను పాఠశాలలకే అప్పగించింది. దీనికోసం ప్రిన్సిపల్‌ నేతృత్వంలో ఎనిమిది మంది ఉపాధ్యాయులతో ప్రత్యేక కమిటీని స్కూళ్లు నియమించాలని కోరింది. ఈ కమిటీలో మ్యాథమెటిక్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ ఉపాధ్యాయులు, ఇద్దరు లాంగ్వేజ్‌ టీచర్లు ఉండాలి. 


సమీపంలోని ఇతర పాఠశాల నుంచి మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. వీరికి సీబీఎ్‌సఈ గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఇంటర్నల్‌ మార్కులను ఇప్పటికే అనేక పాఠశాలలు బోర్డు వెబ్‌సైట్లో నమోదుచేశాయి. ఇంకా చేయనివారు జూన్‌ 11లోగా నమోదుచేయాలి. మిగతా 80 మార్కుల్లో పీరియాడిక్‌ / యూనిట్‌ టెస్టులకు 10, హాఫ్‌ ఇయర్లీ / మిడ్‌ టర్మ్‌ పరీక్షలకు 30, ప్రీబోర్డ్‌ పరీక్షలకు 40 మార్కులకుగాను విద్యార్థులకు వచ్చే మార్కులను కేటాయించాలి. ఈ మూడింటిలో ఒకటి లేదా రెండు పరీక్షలు మాత్రమే జరిగితే వాటిలో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలి. సబ్జెక్టులవారీగా సగటు మార్కులను లెక్కించాలి. మార్కుల విధానం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. విద్యార్థులకు కేటాయించిన మార్కులకు సంబంధించిన రికార్డులను కమిటీ భద్రపరచాలి. మే 25లోపు మార్కుల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి జూన్‌ 5లోపు సీబీఎస్ఈకి సమర్పించాలి. జూన్‌ 20న ఫలితాలు ప్రకటిస్తారు. ప్రైవేటు, సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించి మార్కుల కేటాయింపు విధివిధానాలను త్వరలో విడుదల చేస్తామని సీబీఎ్‌సఈ తెలిపింది. అలాగే 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కూడా త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. 


రాష్ట్రంలో ఎలా..?  

సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన మరుసటిరోజే రాష్ట్రప్రభుత్వం కూడా టెన్త్‌ పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితాల విషయంలోనూ కేంద్రం అమలుచేయనున్న విధానాన్ని పరిశీలిస్తామని ప్రభు త్వ పరీక్షల విభాగం పేర్కొంది. సీబీఎస్ఈ ప్రకటించిన విధానంలో అనేక అంశాలు రాష్ట్రానికి వర్తించకపోవచ్చు. రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు జరిగిన 44 రోజుల్లో ఒక పరీక్ష (ఎఫ్‌ఏ-1) మాత్రమే జరిగింది. కొన్ని పాఠశాలల్లో ఇది కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఎస్ఈ వెల్లడించిన విధానం రాష్ట్రంలో అమలుచేసే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రంలో ‘పది’ మార్కుల కేటాయింపునకు ఏ విధానం అమలుచేయాలన్న అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-02T09:01:53+05:30 IST