విద్యా శాఖలో కొలువు.. విదేశాల్లో నెలవు

ABN , First Publish Date - 2021-06-23T10:52:09+05:30 IST

విద్యా శాఖలో కొలువు.. విదేశాల్లో నెలవు

విద్యా శాఖలో కొలువు.. విదేశాల్లో నెలవు

  • సుదీర్ఘ కాలం సెలవులో ఉంటూ సంపాదన.. 
  • ఆరు నెలలకు అనుమతి.. ఏళ్లుగా డుమ్మా
  • 400మందికి పైగా టీచర్లు, లెక్చరర్ల నిర్వాకం
  • నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. సర్కారు ప్రేక్షక పాత్ర


హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితశాస్త్రం టీచర్‌ ఆస్ట్రేలియా వెళ్తున్నానంటూ 6 నెలల సెలవు పొందారు. ఉన్నత ఉద్యోగం రావడంతో ఆరేళ్లుగా ఆయన అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అదే సారు ఇక్కడా ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భర్త దగ్గరికి వెళ్తున్నానంటూ పాఠశాల విద్యాశాఖ నుంచి 6 నెలల సెలవు పొందారు. నాలుగేళ్లు కావస్తున్నా ఆమె నుంచి సమాచారం లేదు. 


రెండు చోట్ల కొలువులు.. 

ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూనే ఆరు నెలల సెలవు కోసం దరఖాస్తు చేసి.. విదేశాలకు వెళ్లిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వృత్తిలో నైపుణ్యం పెంచుకునేందుకు విదేశాల్లో ఉన్నత విద్య, కొన్నేళ్లపాటు ఉద్యోగానికి డాక్టర్లకు గతంలో అనుమతులు ఉండేవి. తిరిగివచ్చాక వారి అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందనేది మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అయితే ఈ సదుపాయం వైద్యులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తింపచేయాలన్న ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తులపై 3 సెప్టెంబరు 1996లో జీవో-214ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ఏ శాఖ ఉద్యోగి అయినా ప్రభుత్వ అనుమతితో 4 సంవత్సరాల 11 నెలలపాటు విదేశాలకు వెళ్లవచ్చు. అయితే గైర్హాజరైన కాలానికి వేతనం చెల్లించరు. 


సీనియారిటీ మాత్రం కొనసాగుతుంది. అయితే ఈ వెసులుబాటును ఉద్యోగులు ఆదాయ ఆర్జనకు అవకాశంగా మలుచుకుంటున్నారు. 6 నెలల సెలవుపై విదేశాలకు వెళ్లి కొన్నేళ్ల పాటు అక్కడే ఉండి సంపాదించుకున్నాక.. తిరిగి ఇక్కడ ఉద్యోగంలో చేరుతున్నారు. ముందస్తు అనుమతి లేకుండా సంవత్సరాలుగా విధులకు దూరంగా ఉంటున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఒకవైపు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుండగా.. మరోవైపు ఉన్న ఉద్యోగం చాలదనుకుని రెండో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న వారిపై చర్యలు లేకపోవడం ప్రభుత్వ అసమర్థతను, శాఖల్లో లోటుపాట్లను ఎత్తిచూపుతోంది.  


వెసులుబాటు దుర్వినియోగం.. 

సర్వీసులో ఉంటూ విదేశాలకు వెళ్లాలనుకునేవారు ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 నెలల సెలవును మంజూరుచేసే అధికారం పాఠశాల విద్యాశాఖలో డైరెక్టర్‌, ఇంటర్‌ విద్యలో కమిషనర్‌, కాలేజియేట్‌ విద్యలో కమిషనర్‌కు ఉంటుంది. అంతకు మించి 4 సంవత్సరాల 11 నెలల వరకు అయితే ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అంత తేలికగా అనుమతి వచ్చే అవకాశం లేకపోవడంతో.. 6 నెలల సెలవు తీసుకుని ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. జీవో-214 ప్రకారం ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లడం, లేదా ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా 4 సంవత్సరాల 11 నెలల అనుమతి పొంది, అంతకుమించి విదేశాల్లో ఉంటే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఉద్యోగుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.


 అనేక మంది 6 నెలల అనుమతిపై వెళ్లి ఏళ్లుగా విదేశాల్లోనే ఉంటుండగా.. 4 సంవత్సరాల 11 నెలల అనుమతులపై వెళ్లినవారు కూడా కాలం పూర్తయినా తిరిగి రావడం లేదు. ఇక్కడికి వచ్చి ఆ శాఖ ఉన్నతాధికారులను ‘మేనేజ్‌’ చేయవచ్చన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. సీనియారిటీ, పదోన్నతులకు ఇబ్బంది లేకపోవడంతో.. కొన్నేళ్లపాటు విదేశాల్లో సంపాదించుకుని.. మళ్లీ ఇక్కడికి వచ్చి పదోన్నతులు పొందిన వారు సైతం విద్యాశాఖలో ఉండటం గమనార్హం. ఒకరోజు విధులకు గైర్హాజరైతే ప్రైవేటు సంస్థల్లో వేతనంలో కోత విధిస్తారు. కానీ.. ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల తరబడి విధులకు దూరంగా ఉంటున్నా.. వారిపై చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-06-23T10:52:09+05:30 IST