10 నెలలుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ!

ABN , First Publish Date - 2021-12-28T07:51:37+05:30 IST

దళితులు, గిరిజనులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు స్వీకరించి

10 నెలలుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీ!

  •  అపరిష్కృతంగా దళిత, గిరిజన సమస్యలు
  •  కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్న ఫిర్యాదులు
  •  వచ్చే వారం మళ్లీ కోర్టు ముందుకు ‘కమిషన్‌’ అంశం

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దళితులు, గిరిజనులకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేపట్టాల్సిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నెలల తరబడిగా ఖాళీగా మిగిలిపోయింది. గత ఫిబ్రవరిలోనే కమిషన్‌ గడువు ముగిసినా ఇప్పటిదాకా నూతన చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం నియమించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


రాష్ట్ర విభజన అనంతరం 2018లో కమిషన్‌ను పూర్తి స్థాయిలో కమిషన్‌ ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడేళ్ల కాల పరిమితి ముగిసింది. 10 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ నూతన చైర్మన్‌, సభ్యులను నియమించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఖాళీగా ఉండటంతో సంచలనాత్మక కేసుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దళిత మహిళ మరియమ్మ లాక్‌పడెత్‌ విషయంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ స్పందించింది. బీజేపీ కార్పొరేటర్‌పై దాడి, దళిత మహిళను తీవ్ర పదజాలంతో దూషించడం, మహిళలపైన దాడికి పాల్పడిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది.కుప్పలుగా పేరుకుపోతున్న ఫిర్యాదులు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునర్నియమించకపోవడంతో దళిత, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాడులు, భూముల ఆక్రమణ, అకారణంగా దూషణలు... ఇలా రకరకాల అంశాలపై కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నా.. వారికి న్యాయం జరగడం లేదు. కమిషన్‌ కార్యాలయంలో ఈ తరహా ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయ్నాయి. కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు లేకపోవడంతో వస్తున్న దరఖాస్తులను కార్యాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు బదిలీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. పని ఒత్తిడి, ఇతర కారణాలతో ఆయా ఫిర్యాదులపై ఉన్నతాధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు.


గత కమిషన్‌ మూడేళ్లలో 13,905 కేసులను పరిష్కరించి, రూ.78 కోట్లకుపైగా పరిహారాన్ని బాధితులకు అందించింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో దళితుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆయా కమిషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించే విషయంలో కోర్టులు ఆదేశిస్తే గానీ.. రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం లేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విషయంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది. 


ఈ అంశం మరో వారంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించకపోవడం దళిత, గిరిజనుల్ని అవమానించడమేనని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ విమర్శించారు. 


Updated Date - 2021-12-28T07:51:37+05:30 IST