సన్నమో చంద్రశేఖరా!

ABN , First Publish Date - 2021-11-09T07:54:01+05:30 IST

‘‘సన్న రకం వడ్లకు మార్కెట్లో ధర ఉంటుంది. రైతులారా.. సన్న రకాలు ఎక్కువగా సాగు చేయండి’’ అంటూ ప్రోత్సహించిన రాష్ట్ర ప్ర భుత్వం..

సన్నమో  చంద్రశేఖరా!

  • అన్నదాతకు అందని ద్రాక్షలా మారిన మద్దతు ధర
  • సన్న రకం సాగు మేలని ప్రోత్సహించిన ప్రభుత్వం
  • 29.66 లక్షల ఎకరాల్లో సాగు.. 


హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘సన్న రకం వడ్లకు మార్కెట్లో ధర ఉంటుంది. రైతులారా.. సన్న రకాలు ఎక్కువగా సాగు చేయండి’’ అంటూ ప్రోత్సహించిన రాష్ట్ర ప్ర భుత్వం.. తీరా ధాన్యం చేతికొచ్చాక కొనుగోళ్ల సంగతిని మిల్లర్లకు వదిలేసి చోద్యం చూస్తోంది. పెట్టుబడి ఎక్కువై, దిగుబడి తక్కువొచ్చి గతేడాది నష్టపోయినా తట్టుకుని.. ఈసారీ సన్న రకాలు పండించిన అన్నదాతలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవడంలో జాప్యం చేస్తుండడంతో ధాన్యం అమ్మే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు సన్నాలకు ప్రత్యేక ధర, బోనస్‌ అనేది లేకపోవడంతో రైస్‌ మిల్లర్లు ఎంతకు కొంటే అంతకు అమ్మాల్సి వస్తోంది. ఈ క్రమంలో సాధారణ రకం, ఏ-గ్రేడ్‌ ధాన్యం ధర కంటే తక్కువ లభిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.


ఈసారైనా గిట్టుబాటవుతుందని సాగు పెంచితే..

గతేడాది తరహాలో ఈసారి ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలుచేయలేదు. బోనస్‌ కూడా ప్రకటించలేదు. కానీ దొడ్డు వడ్లకు డిమాండ్‌ ఉండదని, సన్న ధాన్యానికి ధర ఎక్కువ వస్తుందని ఏవోలు, ఏఈవోలతో చెప్పించింది. వాస్తవానికి గతేడాది వానలు, వరదలతో రైతులు భారీ నష్టాలు చవిచూశారు. అయితే, ఈసారైనా గిట్టుబాటు అవుతుందని సన్నాలు ఎక్కువ సాగు చేశారు. నిరుడు 25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేస్తే.. ఈసారి 29.66 లక్షల ఎకరాల్లో పండించా రు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది 3 లక్షల ఎకరాల్లో పంట వేయగా ఈ వానాకాలంలో ఏకంగా 4.50 లక్షల ఎకరా ల్లో సాగు చేశారు. కాగా, ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో సన్న రకాల వాటానే దాదాపు సగం ఉండడం గమనార్హం.


సన్న బియ్యం ధరను శాసిస్తున్న మిల్లర్లు

కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ఎమ్మెస్పీ ప్రకటించేటపుడు సన్నాలకో ధర, దొడ్డు రకాలకో ధర నిర్ణయించదు. ఏ-గ్రేడ్‌, సాధారణ రకం అనే రెండు కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాదికి ఏ- గ్రేడ్‌ ధాన్యం క్వింటాకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 ఎమ్మెస్పీ నిర్ణయించింది. 1 శాతం మట్టి, 1 శాతం తాలు, 5 శాతం కల్తీలు, 3 శాతం పాలు తక్కువ పట్టిన గింజలు, 17 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ ఎమ్మెస్పీకి కొనుగోలుచేయాలి. అయితే, కొన్నేళ్లుగా రైతుల నుంచి సన్న ధాన్యం కొని, మిల్లింగ్‌ చేసి.. బియ్యాన్ని మార్కెట్లో విక్రయిస్తున్న రైస్‌ మిల్లర్లే సన్నాల ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉండడంతో క్వింటా సన్న బియ్యాన్ని రూ.4,500 నుంచి రూ.4,600కు అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో సన్న ధాన్యం క్వింటాకు రూ.2,200 నుంచి రూ. 2,300 చొప్పున కొన్నప్పటికీ మిల్లర్లకు ఏమాత్రం నష్టం ఉండదు. కానీ ఎమ్మెస్పీ కంటే, దొడ్డు రకాల కంటే తక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. సన్నాలకు ప్రత్యేక ఎమ్మెస్పీ లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించకపోవడంతో తాము తప్ప గత్యంతరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. 


సీజన్‌ ఆరంభంలో క్వింటా రూ.2 వేల నుంచి రూ.2,100కి కొన్నారు. వరి కోతలు ఊపందుకుని, ధాన్యం పోటెత్తిన ఈ సమయంలో రూ.1,760 నుంచి రూ.1,800కు కొంటున్నారు. ఇది దొడ్డు రకాల కంటే, ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర.  మిల్లర్లు మాత్రం సన్న ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్‌ చేసి, కొంత మోతాదులో స్టీమ్‌ ఇచ్చి హైదరాబాద్‌, అంతర్‌ రాష్ట్ర మార్కెటో విక్రయిస్తున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోకెన్లు ఇచ్చినపుడే పంట కోయాలంటూ మిల్లర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వరి కోతలను శాసిస్తున్నారు. ఒక టోకెన్‌ 2 ఎకరాల పంటకే వర్తిస్తోంది. 3 రోజులకు 200 టోకెన్ల చొప్పున జారీ చేస్తున్నారు. రోజుల కొద్దీ ఎదురుచూసి, క్యూ లైన్లలో నిలబడి టోకెన్లు సంపాదించడం రైతులకు పంట సాగు కంటే ఎక్కువ కష్టంగా మారింది. ఈ వ్యవఽధిలో ధాన్యం ఎండిపోయి, బరువు తగ్గుతోంది. తాటిపత్రులు, కల్లాలు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి మొలకలు వస్తున్నాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అధికార యంత్రాంగమంతా రైస్‌ మిల్లర్లకే వత్తాసు పలుకుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కొనుగోళ్ల భారం తగ్గించుకునే ఎత్తుగడ?

ఇప్పటికి మూడో వంతు కేంద్రాలే ఏర్పాటు

70 లక్షల టన్నులకు కొన్నది 2.5 లక్షల టన్నులే


వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. వచ్చే ఏడాది ఉప్పుడు బియ్యం ఒక్క గింజ కూడా తీసుకునేది లేదని  తేల్చేసింది. దీన్ని ఆసరాగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా సేకరణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. సన్నధాన్యం సాగు చేయాలని చెప్పి కూడా.. నయాపైసా బోనస్‌ ప్రకటించలేదు. నిరుడు క్విం టాకు వందో, నూట యాభై అధికంగా ఇస్తామని ప్రకటించి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు ధాన్యం విక్రయిస్తున్న సమయంలో కొనుగోళ్లను మిల్లర్లకు అప్పగించిం ది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. సన్న ధాన్యానికి అఽధిక ధర కాకపోయినా, ఎమ్మెస్పీ అయినా లభించేది. కానీ, 6,500 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి 2,500 మాత్రమే తెరిచింది. సన్న, దొడ్డు రకాలు కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచాలుండగా.. 60 లక్షల టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. 20 లక్షల టన్నులు అదనంగా కొనాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. అంటే ఇంకా 70 లక్షల టన్నులైనా కొ నాలి.  2.5 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొన్నది. మిల్ల ర్లు, వ్యాపారులు, దళారులు ఎక్కువగా కొంటే తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తవుతుందనే ఉద్దేశంలో ఉంది.

Updated Date - 2021-11-09T07:54:01+05:30 IST