గడీల పాలనను బద్దలు కొడతాం

ABN , First Publish Date - 2021-01-14T04:44:49+05:30 IST

గడీల పాలనను బద్దలు కొడతాం

గడీల పాలనను బద్దలు కొడతాం
గాయపడ్డ బీజేపీ నాయకుడిని పరామర్శిస్తున్న బండి సంజయ్‌

బీజేపీని తక్కువగా అంచనా వేయొద్దు

మునిసిపల్‌ కమిషనర్‌, సీఐపై చర్యలు తీసుకోవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శ


జనగామ(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ గడీల పాలనను బద్దలు కొట్టి రాజకీయంగా సమాధి చేసేదాకా ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శపథం చేశారు. బీజేపీ నేతలపై లాఠీచార్జి చేసిన సీఐ మల్లేశ్‌, అందుకు కారణమైన మునిసిపల్‌ కమిషనర్‌ సమ్మయ్యపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకులు వారణాసి పవన్‌ శర్మ, కోట వినోద్‌, క్రాంతి, జంగ నర్సింహారెడ్డి, హరీశ్‌, చిరంజీవిని జనగామ జిల్లా ఆస్పత్రిలో బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీని తక్కువగా అంచనా వేయొద్దని, పోలీసు ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా తమ వ్యూహాన్ని పసిగట్టలేవని, ఆ తరహాలో ఉద్యమం ఉంటుందని అన్నారు.


ఏడాదిగా బీజేపీని టార్గెట్‌ చేసి కార్యకర్తలను పోలీసుల ద్వారా చిత్రహింసలకు గురిచేస్తూ సీఎం కేసీఆర్‌ ఓ మానవ మృగంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు తెలంగాణలో నిషేధించారా? అని ప్రశ్నించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని నిరసిస్తూ మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్యకర్తలను నానా బూతులు తిడుతూ జనగామ సీఐ మల్లేశ్‌, ఎస్సై శ్రీనివాస్‌ విచక్షణారహితంగా కొట్టారన్నారు. బండి సంజయ్‌ వెంట రాష్ట్ర నేతలు ప్రేమేందర్‌రెడ్డి, విజయరామారావు, బండ్రు శోభారాణి, రాకేశ్‌రెడ్డి, అంజన్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, తదితరులు ఉన్నారు.


డీసీపీ కార్యాలయం ముట్టడికి యత్నం

పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్‌ జనగామ చౌరస్తా నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ర్యాలీగా వెళ్లారు. చౌరస్తా నుంచి ర్యాలీగా వస్తున్న క్రమంలో డీసీపీ కార్యాలయం వద్దకు రాగానే ఒక్కసారిగా కార్యకర్తలు అందులోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు.  


సమగ్ర విచారణ :సీపీ ప్రమోద్‌కుమార్‌

బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జిపై  సమగ్ర విచారణ జరపాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ బి.శ్రీనివాసరెడ్డికి సీపీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 



Updated Date - 2021-01-14T04:44:49+05:30 IST