వందనం.. నాలుగో సింహం..

ABN , First Publish Date - 2021-10-21T05:59:46+05:30 IST

ఎన్నో కష్టనష్టాలు అధిగమించి పోలీసు కొలువు చేయడం ఓ యజ్ఞం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రాణాలను పనంగా పెట్టి విధుల్లో నిమగ్నమవుతారు. భార్యాబిడ్డలకు దూరంగా ఉండి విఽధి నిర్వహణకే పూర్తికాలాన్ని వెచ్చిస్తారు. ఉపాధి కోసం ఉద్యోగం చేస్తూ నక్సలైట్ల తుపాకీ గుండ్లకు, మందుపాతరలకు ప్రాణాలొడ్డిన పోలీసు త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారి గౌరవార్థం పోలీసు శాఖ యేటా ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

వందనం.. నాలుగో సింహం..

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
గత యేడాది నుంచి వేడుకల్లో మార్పు
నేషనల్‌ యూనిట్‌ (ఫ్లాగ్‌)డే గా మార్పు
21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు
ఆర్థిక ఇబ్బందుల్లో అమరుల కుటుంబాలు
ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన


ఎన్నో కష్టనష్టాలు అధిగమించి పోలీసు కొలువు చేయడం ఓ యజ్ఞం. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రాణాలను పనంగా పెట్టి విధుల్లో నిమగ్నమవుతారు. భార్యాబిడ్డలకు దూరంగా ఉండి విఽధి నిర్వహణకే పూర్తికాలాన్ని వెచ్చిస్తారు. ఉపాధి కోసం ఉద్యోగం చేస్తూ నక్సలైట్ల తుపాకీ గుండ్లకు, మందుపాతరలకు ప్రాణాలొడ్డిన పోలీసు త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారి గౌరవార్థం పోలీసు శాఖ యేటా ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

హనుమకొండ క్రైం, అక్టోబరు 20: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గతంలో యేటా అక్టోబర్‌ 15 నుంచి 21వరకు నిర్వహించేది. కానీ కిందటేడు నుంచి రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్టోబర్‌ 21 నుంచి 31 వరకు పది రోజుల పాటు ‘నేషనల్‌ యూనిట్‌ డే’గా మార్పు చేసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పది రోజుల పాటు కమిషనరేట్‌ పరిధిలో పలు కార్యక్రమాలతో పాటు వ్యాసరచన,  వకృత్వ, సైక్లింగ్‌ పోటీలతో పాటు రక్తదాన కార్యక్రమాలు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. 31న సర్ధార్‌వల్లబాయ్‌పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని పోలీసులు అధికారులు వెల్లడించారు. ఆ రోజు జరిగే కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించి స్మృతివనంలో ఘనంగా నివాళి అర్పిస్తారు. అమరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందిస్తారు.

కన్నీటి గాధ
పోలీసు అమరుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ కుటుంబాన్ని కదిలించినా హృదయం ద్రవించే కన్నీటిగాథే కనిపిస్తోంది. తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని కోల్పోయిన వారు కొందరైతే.. ఊహ తెలియని వయస్సులోనే కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన పిల్లలు మరెందరో ఉన్నారు. పెళ్లైన మూణ్నాళ్లకే తమ ఐదోతనాన్ని కోల్పోయారు కొందరు మహిళలు. భర్త పోయి సమాజంలో గౌరవం లభించక నిత్యం నరకం అనుభవిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయినవారందరూ ఉండి కూడా భర్త లేడన్న చులకన.. శుభ, అశుభకార్యాలకు దూరంగా, కుటుంబాన్ని నెట్టుకొచ్చే క్రమంలో సూటిపోటి మాటలు, మానసిక క్షోభను దిగమింగుతున్నారు. అయినా బాధలను గుండెల్లో దిగమింగి భర్త ఆశయాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం బతుకుబండి ఈడుస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పోలీసు ఉద్యోగుల జీతాలు ప్రస్తుతం కొంత పెరిగినా అమరుల కుటుంబాల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. వచ్చే వేతనం ఏ మూలకు సరిపోక అమరుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. యేడాదికోమారు నిర్వహించే పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు తప్ప.. తమను పట్టించుకున్నవారే లేరని అమరుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్షేమ సంఘం
2005లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమ సంఘం ఏర్పడింది. స్వయంప్రతిపత్తి కలిగిన ఈ సంఘం ద్వారా చాలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. 2006లో కమిషనరేట్‌ కార్యాలయంలో సొంత కార్యాలయాన్ని ఏర్పర్చుకుని హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారు. నాటి ఎస్పీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రోత్సాహంతో ఏర్పడిన పోలీసు అమరవీరుల సంక్షేమ సంఘం.. నేడు ఉమ్మడి వరంగల్‌ పోలీసుశాఖలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. వ్యవస్థాపక అధ్యక్షురాలిగా సిలువేరు రమాదేవి కొనసాగుతుండగా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం కూడా వీరి బాగోగులు చూసుకుంటోంది. పోలీసు అమరుల కుటుంబాలకు ఎంసెట్‌ పరీక్షలో 2శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించడంతో నాలుగు కుటుంబాల పిల్లలు ప్రస్తుతం మెడిసిన్‌ పూర్తి చేశారు.  

అమరులు
ఉమ్మడి జిల్లాలో 64 మంది పోలీసు సిబ్భంది అమరులయ్యారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి డీఎస్పీ వరకు 59మంది, హోంగార్డులు 5గురు మొత్తంగా ఉమ్మడి జిల్లాలో జరిగిన వి విధ ఎన్‌కౌంటర్లు, మందుపాతరలలో 64మంది అసువులుబాశారు.  ప్రధానంగా 1996లో జాకారం వద్ద జరిగిన మందుపాతరలో ఏడు పోలీసు కుటుంబాల్లో చీకటి కమ్మింది. ఇంకా ఏటూరునాగారం, మంగపేట ఇతరత్రా ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలో పోలీసు అమరవీరులు ప్రాణాలర్పించారు.

తండ్రిలేని లోటును పూడ్చలేకపోతున్నాం..
- సిలివేరు రమాదేవి, పోలీసు అమరుల సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్‌జిల్లా అధ్యక్షురాలు

మూడు మాసాల గర్భవతిగా ఉన్న సమయంలో నా భర్త గోవర్ధన్‌రావు జాకారం మందుపాతరలో మృతిచెందాడు. నా బిడ్డ తన తండ్రి ఎలా ఉంటాడో స్వయంగా చూడలేదు. ఇప్పటికీ ఏడ్వడమే తప్ప ఏం చేయలేని పరిస్థితి. పోలీసు శాఖ ఎన్నికోట్లు ఇచ్చినా తండ్రిని తెచ్చి ఇవ్వగలరా? మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి జీవచ్ఛవంలా జీవితాలు గడుపుతున్నాము. నా బిడ్డ ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పటికీ తండ్రిలేని లోటును తీర్చలేకపోతున్నాను.

మా బతుకులు మారడం లేదు..
- శ్రీపతి నిర్మల. అమరుడు సాంబయ్య భార్య

నా భర్త 1985లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ నాకు చిన్నఉద్యోగం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్లాటు ఇచ్చారు.. అనుమతి ఇవ్వలేదు. మెమోరాండం ఇస్తూనే ఉన్నాము. అధికారులు మారుతున్నారు కానీ.. మా బతుకులు మారడం లేదు.


త్యాగాలను స్మరించుకుందాం..
వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి
హనుమకొండ క్రైం, అక్టోబరు 20: శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకుందామని వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 21 నుంచి 31 వరకు పోలీసు అమరుల త్యాగాలకు గుర్తుగా ఫ్లాగ్‌డేను నిర్వహిస్తున్న సీపీ వెల్లడించారు. నేడు (గురువారం) తొలిరోజు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ ఆవరణలోని పోలీసు అమరవీరుల స్మృతివనంలో సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్మృతివనంలో నక్సలైట్ల చేతిలో అమరులైన పోలీసులకు గుర్తుగా శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు శోక్‌శ్రస్ట్‌ పరేడ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం కమిషనరేట్‌ కార్యాలయంలో నుంచి అశోకాజంక్షన్‌ వరకు పోలీసుల కవాతు నిర్వహించబడుతుందన్నారు. వివిధ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందితో పాటు పోలీసు అమరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
సంస్మరణ దినోత్సవం రోజుల్లో కమిషనరేట్‌ పరిధిలోని 9 పోలీసు డివిజన్‌లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 8వ తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ‘భారతదేశ అభివృద్ధిలో పోలీసు పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఔత్సాహిత ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌హౌస్‌ నిర్వహిస్తామన్నారు. తొలిసారిగా పోలీసు కళాబృందం, పోలీసు బ్యాండ్‌ బృందంత కమిషనరేట్‌ పరిధిలోని పలు సెంటర్‌లలో కళాప్రదర్శన నిర్వహిస్తామన్నారు. పోలీసు అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని సీపీ తరుణ్‌జోషి కోరారు.

కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి
హనుమకొండ క్రైం, అక్టోబరు 20: పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు అధికారులు, సిబ్బందితో పా టు పోలీసు అమరవీరుల కుటుంబాలు బు ధవారం కొవ్వొత్తున ర్యా లీ నిర్వహించారు. సీపీ తరుణ్‌జోషితో పాటు పోలీసుఅధికారులు హనుమకొండ అశోకా జంక్షన్‌ నుంచి కమిషనరేట్‌ కార్యాలయం అమరుల స్మృతివనం వరకు కొ వ్వొత్తులు వెలిగించి శాంతిర్యాలీ నిర్వహించారు. అమరుల స్థూపం వద్దకు చేరుకుని శద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్‌జోషి మాట్లాడారు. పో లీసు అమరుల త్యాగాల వల్ల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. పోలీసులు బలిదానాలను స్మరిస్తూ కర్తవ్య నిర్వహణలో ముందుకు సా గిపోవాలన్నారు. ఈకార్యక్రమంలో డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ భీంరావు, సంజీవరావు, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు పోలీసు అధికారుల సంఘం నాయకులతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





Updated Date - 2021-10-21T05:59:46+05:30 IST