శ్మశానవాటిక నుంచే పాలన
ABN , First Publish Date - 2021-08-25T07:29:44+05:30 IST
అదో శ్మశానవాటిక. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన దహన వాటికకు ఎదురుగా ఓ చిన్న గది ఉంది.

- గొట్టిగకలాన్‌లో దొరకని అద్దె భవనం
- పంచాయతీ భవనంగా వాటికలోని గది
బషీరాబాద్, ఆగస్టు 24: అదో శ్మశానవాటిక. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన దహన వాటికకు ఎదురుగా ఓ చిన్న గది ఉంది. అందులో ఓ టేబుల్. కొన్ని కుర్చీలున్నాయి. అక్కడ గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి కూర్చుని ఉన్నారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజల కోసం వారు రోజూ ఇక్కడే అందుబాటులో ఉంటారు. శ్మశాన వాటికలోని ఆ గదినే వారు పంచాయతీ భవనంగా మార్చుకున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గొట్టిగకలాన్ గ్రామంలోని పరిస్థితి ఇది. ఈ ఊరికి రెండేళ్ల క్రితం గ్రామ పంచాయతీ హోదా దక్కింది. గ్రామానికంటూ ఇప్పటిదాకా సొంత పంచాయతీ భవనం మంజూరు కాలేదు. సర్పంచ్ సాబేర్ పాషాకు సొంతిల్లు ఉన్నా, అది చిన్నగా ఉండటంతో ఓ పాత గదిని అద్దెకు తీసుకొని పాలన ఇన్నాళ్లు కొనసాగించారు. ఇటీవల యజమాని, ఆగదిని కూడా ఖాళీ చేయించాడు. ఊర్లో అద్దె ఇళ్లు దొరికే పరిస్థితి లేదు. ఇటీవలే గ్రామంలో కొత్తగా శ్మశానవాటిక నిర్మించారు. అక్కడ మృతుల కుటుంబసభ్యులు, బంధువుల విశ్రాంతి కోసం ఓ చిన్న గదిని కూ డా నిర్మించారు. తప్పని పరిస్థితుల్లో వాటికలోని ఈ చిన్న భవనాన్ని తాత్కాలిక పంచాయతీ భవనంగా మా ర్చారు. ఇది చూసిన పలువురు ఇదేం దుస్థితి అని చర్చించుకుంటున్నారు.