దళిత సీఎం పేరిట మోసం

ABN , First Publish Date - 2021-07-24T07:25:08+05:30 IST

ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో మోసగించారన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 మంది

దళిత సీఎం పేరిట మోసం

మళ్లీ అలాంటి పరిస్థితులు రానివ్వొద్దు

ఉప ఎన్నిక ఉన్నందుకే హుజూరాబాద్‌కు వెయ్యి కోట్లు

ఆ డబ్బును గురుకుల పాఠశాలలకు ఖర్చు చేయాలి

ఉత్సవ విగ్రహాలుగా 29 మంది దళిత ఎమ్మెల్యేలు

రాజీనామా చేసిన మరుసటి రోజే నాపై కేసు

కేసులకు భయపడను: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సంగారెడ్డి రూరల్‌, జూలై 23: ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో మోసగించారన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే తాను ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన మరుసటిరోజే తనపై కేసు పెట్టారని, ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ‘‘మనకు నిజమైన అభివృద్ధి, అధికారం కావాలి. బహుజన రాజ్యం స్థాపించుకుందాం. మళ్లీ వెయ్యేళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. మీ బిడ్డగా ప్రశ్నించడానికి వచ్చాను. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే ధైర్యం రావాలి’’ అని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. 


ప్రవీణ్‌కుమార్‌ రాజకీయాల్లోకి రావాలి 

ప్రవీణ్‌కుమార్‌ రాజకీయా ల్లోకి రావాలంటూ స్వేరో స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రతి నిధులు భువనగిరి నుంచి హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వరకు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T07:25:08+05:30 IST